Begin typing your search above and press return to search.

'పుష్ప' బయ్యర్లను ఆదుకుంటున్న మైత్రీ నిర్మాతలు..?

By:  Tupaki Desk   |   8 Jan 2022 10:30 AM GMT
పుష్ప బయ్యర్లను ఆదుకుంటున్న మైత్రీ నిర్మాతలు..?
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప: ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా 2021లో అత్యధిక గ్రాస్ వసూలు చేసింది. నిజానికి ఈ మూవీ ఫస్ట్ డే మిశ్రమ స్పందన స్పందన తెచ్చుకుంది. రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి. కానీ చివరకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.

తమిళం, మలయాళంలో 'పుష్ప' పార్ట్-1 సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. హిందీలో అంచనాలకు మించి వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. నార్త్ లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు దాదాపు 75 కోట్ల వరకు వసూళ్ళు సాధించడం గమనార్హం. ఇక తెలంగాణాలోనూ లాభాలు తెచ్చుకున్న ఈ సినిమా.. ఆంధ్రప్రదేశ్ మరియు యూఎస్ఏలో మాత్రం బ్రేక్ ఈవెన్ అవలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో నష్టపోయిన బయ్యర్లను నిర్మాతలు ఆదుకునే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.

'పుష్ప: ది రైజ్' సినిమాకు సంబంధించిన హక్కులను నిర్మాతలు విడుదలకు ముందే మంచి ధరకు అమ్మేశారు. ఇప్పుడు హిందీ మార్కెట్ వల్ల అదనపు ఆదాయం చేకూరింది. అంతేకాదు పార్ట్-1 విజయంతో 'పుష్ప-2' చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలో నష్టపోయిన బయ్యర్లకు అండగా ఉండాలని మైత్రీ మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఏరియా వైజ్ ఎంత నష్టం వచ్చిందో లెక్కలు చూసి.. అందులో 50 శాతం వరకు తిరిగి వెనక్కి ఇచ్చేసారని టాక్ వినిపిస్తోంది.

అధిక డబ్బు చెల్లించి సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఏపీలో టికెట్ ధరల కారణంగా నష్టపోవాల్సి వచ్చింది. హిందీలో మంచి వసూళ్ళు రావడంతో ఇప్పుడు మేకర్స్ వారికి కొంత డబ్బు వాపసు ఇవ్వగా.. మరికొందరికి 'పుష్ప: ది రైజ్' హక్కులను తక్కువ రేట్లకు ఇచ్చి నష్టాలను పూడ్చుకునే అవకాశం ఇస్తున్నారని టాక్.

ఇకపోతే 'పుష్ప' పార్ట్-1 ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే మూడు వారాలు థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జనవరి 7న స్ట్రీమింగ్ పెట్టారు. హిందీలో ఇంకా మంచి వసూళ్ళు సాధిస్తుండటంతో.. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్సన్స్ మాత్రమే ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. థియేటర్లలో సినిమాని మిస్ అయిన జనాలు సంక్రాంతి సీజన్ లో 'పుష్ప: ది రైజ్' ని చూసే అవకాశం ఉంది.