Begin typing your search above and press return to search.

బన్నీ రేంజ్ తగ్గిందేమిటబ్బా..

By:  Tupaki Desk   |   1 May 2018 5:30 PM GMT
బన్నీ రేంజ్ తగ్గిందేమిటబ్బా..
X
గత ఐదేళ్లలో సౌత్ ఇండియాలో భారీగా ఫాలోయింగ్ మార్కెట్, ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల జాబితా తీస్తే అందులో అల్లు అర్జున్ పేరు ముందుంటుంది. ‘జులాయి’ టైంలో రూ.40 కోట్ల మార్కెట్ ఉండేదతడికి. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ మోస్తరుగానే ఉండేది. కానీ గత నాలుగైదేళ్లలో ఫాలోయింగ్, మార్కెట్ బాగా పెంచుకున్నాడు. అతడి సినిమాలు రూ.100 కోట్ల బిజినెస్ చేసే స్థాయికి చేరాయి. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో సైతం 60-70 కోట్ల షేర్ సాధించే రేంజికి ఎదిగాడు. రెండేళ్ల కిందట ‘సరైనోడు’కు యావరేజ్ టాక్ వచ్చినా రూ.75 కోట్లకు పైగా షేర్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గత ఏడాది ‘దువ్వాడ జగన్నాథం’ను అందరూ తీసిపారేసినా రూ.70 కోట్ల దాకా షేర్ సాధించింది. ఈ నేపథ్యంలో బన్నీ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’కు రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతుందేమో.. బన్నీ కొత్త శిఖరాల్ని టచ్ చేస్తాడేమో అనుకున్నారంతా.

కానీ ‘నా పేరు సూర్య’కు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. ‘డీజే’ అంచనాల్ని మించి వసూళ్లు సాధించినా.. బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఆ ప్రభావం దీనిపై పడ్డట్లుంది. పైగా కొత్త దర్శకుడి సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే మాస్ వినోదం ఉన్నట్లుగా కనిపించడం లేదు. అందుకే బయ్యర్లు వేలం వెర్రిగా బిజినెస్ ఆఫర్లు ఇచ్చినట్లు లేదు. ‘డీజే’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.77 కోట్లు పలికితే.. ‘నా పేరు సూర్య’కు రూ.75 కోట్లే పలికాయి. ఏడాది ఏడాదికి రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ‘డీజే’తో పోలిస్తే ఓ పది కోట్లు ఎక్కువే బిజినెస్ చేయాలి ‘నా పేరు సూర్య’. కానీ దాని రేంజిని కూడా అందుకోలేకపోయింది.

నైజాం హక్కులు రూ.18 కోట్లు పలికితే.. సీడెడ్ హక్కులు రూ.11 కోట్లు తెచ్చాయి. వైజాగ్ హక్కులు రూ.7.5 కోట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపితే రూ.22 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. ‘దువ్వాడ జగన్నాథం’ ఓవర్సీస్‌లో పెద్ద దెబ్బ కొట్టిన నేపథ్యంలో ఆ సినిమాతో పోలిస్తే రూ.2 కోట్లు తక్కువగా.. రూ.6 కోట్లే పలికాయి ‘నా పేరు సూర్య’ హక్కులు. కాకపోతే శాటిలైట్ హక్కుల ద్వారా రూ.25 కోట్ల ఆదాయం రావడం మాత్రం ఊరటే. మొత్తానికి బన్నీ టార్గెట్ అయితే మరీ పెద్దగా లేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకుని వీకెండ్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేయొచ్చు. ఆ తర్వాత కూడా హోల్డ్ చేయగలిగితే ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టొచ్చు.