Begin typing your search above and press return to search.

80 సెకన్ల బన్నీ రచ్చ

By:  Tupaki Desk   |   24 Dec 2017 2:08 PM GMT
80 సెకన్ల బన్నీ రచ్చ
X
కొన్ని నెలల కిందటే మొదలైంది అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’. సినిమా మొదలయ్యే ముందే టైటిల్ ప్రకటించేసి.. టైటిల్ లోగో కూడా లాంచ్ చేసేశారు. అప్పట్నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ లేదు. ఏ విశేషాన్నీ పంచుకోలేదు. ఐతే అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఇంకో వారం రోజుల్లోనే ‘నా పేరు సూర్య’ తొలి విశేషం బయటికి వచ్చేస్తోంది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ చేస్తామని నిన్న రాత్రి చిత్ర బృందం ప్రకటించింది. ఇంతకీ ఈ ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి అన్న సందేహం కలగొచ్చు. నెటిజన్లు కూడా ఇది ఫస్ట్ లుక్కా.. లేక ఫస్ట్ టీజరా అన్న సందిగ్ధంలో పడిపోయారు.

జనవరి 1న రాబోయేది ఫస్ట్ టీజరే అని సమాచారం. అది 1 నిమిషం 20 సెకన్ల నిడివితో ఉంటుందట. ఫస్ట్ ఇంపాక్ట్ బలంగా ఉండేలా ఈ టీజర్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ‘నా పేరు సూర్య’ చాలా సీరియస్ గా సాగే సినిమా అట. ఇందులో బన్నీ ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడని.. ఆ పాత్ర నేపథ్యంలోనే టీజర్ సాగుతుందని.. టీజర్ రిలీజయ్యాక టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ రూపొందిస్తున్నాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం విశాల్-శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరూ తెలుగులో ‘చింతకాయల రవి’కి పని చేశారు.