Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'నాంది'

By:  Tupaki Desk   |   19 Feb 2021 8:50 AM GMT
మూవీ రివ్యూ: నాంది
X
చిత్రం : ‘నాంది’


నటీనటులు: అల్లరి నరేష్-వరలక్ష్మి శరత్ కుమార్-నవమి-వినయ్ వర్మ-హరీష్ ఉత్తమన్-ప్రవీణ్- ప్రియదర్శి-దేవీప్రసాద్-శ్రీకాంత్ అయ్యంగార్ తతదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సిద్
కథ: తూమ్ వెంకట్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: సతీశ్ వేగేశ్న
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కనకమేడల

కామెడీ సినిమాలతో ఎదురు దెబ్బలు తిని తిని అలసిపోయిన అల్లరి నరేష్.. తన శైలికి భిన్నంగా చేసిన సినిమా ‘నాంది’. నరేష్ గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా, సీరియస్ గా కనిపించిన ఈ సినిమా ప్రోమోలతో ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘నాంది’ సినిమాగా ఏ మేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్) ఒక మధ్య తరగతి కుర్రాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం సంపాదించి.. తల్లిదండ్రులతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న అతను అనుకోకుండా రాజగోపాల్ అనే లాయర్ హత్య కేసులో చిక్కుకుంటాడు. సీఐ కిషోర్ (హరీష్ ఉత్తమన్) అతణ్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికిస్తాడు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సృష్టించడంతో సూర్య ప్రకాష్ చేయని నేరానికి జైలులో మగ్గాల్సి వస్తుంది. ఐదేళ్లకు పైగా జైలు జీవితం గడిపి ఇక తాను బయటికి వస్తానన్న ఆశ పూర్తిగా కోల్పోయిన దశలో ఆద్య (వరలక్ష్హి శరత్ కుమార్) అనే లాయర్ అతడి కేసును టేకప్ చేస్తుంది. సూర్యప్రకాష్ ను బయటికి తీసుకురావడానికి ఆమె ఏం చేసింది.. హత్య కేసులో అసలు దోషులెవరు.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

గత కొన్నేళ్లలో అల్లరి నరేష్ ఏ సినిమా ఆకర్షించని స్థాయిలో ‘నాంది’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవం. రొటీన్ కామెడీ సినిమాలతో విసుగెత్తించేసిన నరేష్.. తన శైలికి పూర్తి భిన్నంగా చేసిన సీరియస్.. ఇంటెన్స్ మూవీ ‘నాంది’. ఈ విషయం ప్రోమోల్లోనే స్పష్టంగా తెలిసిపోయింది. నరేష్ కు కొత్తగా ఉండటమే కాదు.. తెలుగులో కూడా ఇదొక విభిన్న ప్రయత్నమే. చేయని నేరానికి జైలు పాలైన ఓ సామాన్యుడు.. తన పోరాటంతో ఎలా బయటికి వచ్చాడు.. తనను ఇరికించిన వాళ్లపై చట్టబద్ధంగానే ఎలా పోరాడి గెలిచాడు అనే భిన్నమైన పాయింట్ తో ఈ సినిమా నడుస్తుంది. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు అరుదే. వినడానికి ఆసక్తికరంగా అనిపించే ఈ పాయింట్ ను సిన్సియర్ గా.. ఇంటెన్స్ గా తీస్తే ‘నాంది’ ఒక మైలురాయి లాంటి సినిమా అయ్యేదే. కానీ ఈ కథను అవసరమైనంత బిగితో చెప్పడంలో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల విఫలమయ్యాడు. కొన్ని చోట్ల సిన్సియర్ గానే ప్రయత్నించినా.. మధ్య మధ్యలో కాడి వదిలేయడం.. రొటీన్ కమర్షియల్ స్టయిల్ ట్రై చేయడంతో ‘నాంది’ ఎటూ కాకుండా పోయింది. చట్టంలోని ఒక కొత్త సెక్షన్ గురించి చెప్పి.. కొంత చర్చించి.. అదే సినిమాను నిలబెట్టేస్తుంది అన్నట్లుగా రొటీన్ ట్రీట్మెంట్ తో సినిమాను నడిపించడంతో ‘నాంది’ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయింది.

కోర్ట్ రూం డ్రామా అనగానే.. కేసు విచారణతో ముడిపడ్డ సన్నివేశాలు ఎంతో పకడ్బందీగా ఉండాలని ఆశిస్తాం. ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఉత్కంఠ రేకెత్తించేలా సన్నివేశాలు ఉంటేనే సినిమా పండుతుంది. ఆషామాషీగా ఆ సన్నివేశాలు రాసుకుంటే సినిమానే చెడిపోతుంది. ‘నాంది’కి ఇదే మైనస్ అయింది. హీరోను కేసులో ఇరికించే సన్నివేశాలు పేలవంగా ఉండటంతో ‘నాంది’ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి వస్తుంది. హత్యకు గురైన వ్యక్తితో కలిసి యాదృచ్ఛికంగా మూడుసార్లు సీసీటీవీలో కనిపించాడని.. హత్య జరిగిన మరుసటి రోజే పది లక్షల రూపాయలు ఫ్లాట్ కు అడ్వాన్సుగా ఇచ్చాడని (ఇది హత్య కోసం తీసుకున్న సుపారీ అన్నది అభియోగం).. ఈ కారణాలు చూపించి హీరోనే హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చేసి అతణ్ని కేసులో ఇరికించేయడం.. కోర్టులో ప్రొసీడింగ్స్ అతడికి వ్యతిరేకంగా నడవడం కన్విన్సింగ్ గా అనిపించదు. ఈ సన్నివేశాల్లో ఇంటెన్సిటీ లోపించడంతో ఆ తర్వాతి పరిణామాలను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి వస్తుంది.

హీరోను ఇరికించే సన్నివేశాలు ఎంత సాధారణంగా అనిపిస్తాయో.. ఆ తర్వాత అతణ్ని లాయర్ బయటికి తీసుకొచ్చే సన్నివేశాలు కూడా అంత తేలిగ్గా అనిపిస్తాయి. చాలా సింపుల్ గా కేసును తారుమారు చేసి హీరోను బయటికి తీసుకొచ్చేయడం కూడా కన్విన్సింగ్ గా అనిపించదు. ఈ తరహా సినిమాలకు ఇలాంటి నరేషన్ సూట్ కాదు. మలయాళంలో దాదాపు ఇలాంటి కథతోనే ఓ సినిమా వచ్చింది. టొవినో థామస్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ‘వ్యూహం’ పేరుతో ‘ఆహా’లో రిలీజ్ చేశారు కూడా. ఆ సినిమా చూస్తే అమాయకులను పోలీసులు ఎలా కేసుల్లో ఇరికిస్తారనే క్రమాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు. ఎంతో బిగితో కనిపించే ఆ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. కన్విన్సింగ్ గానూ అనిపిస్తాయి. అందులో కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఉత్కంఠ రేకెత్తిస్తాయి. అందులోని ఇంటెన్సిటీనే ‘నాంది’లో లోపించింది. అలాగని ‘నాంది’ మరీ తీసి పడేయదగ్గ సినిమా ఏమీ కాదు. హీరో బయటికి రావడం వరకు రొటీన్ గా అనిపించినా.. ఆ తర్వాత అతను ఆవేశపడకుండా తనను ఇరికించిన పోలీస్ మీద రివర్సులో 211 కేసు పెట్టడం.. దాని కోసం పోరాడటం ఈ సినిమాలో కొత్తగా.. ఆసక్తికరంగా అనిపించే పాయింట్. దాని చుట్టూ నడిపిన కొంత కథనం ఆకట్టుకుంటుంది. అలాగే నరేష్ ఆద్యంతం ఇంటెన్సిటీ తగ్గకుండా ఇచ్చిన పెర్ఫామెన్స్ వల్ల కూడా ఆ పాత్రతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే అసలు హత్య ఎవరు చేశారు.. దాని వెనుక కథేంటి అనే దగ్గరికెళ్లేసరికి ‘నాంది’ మళ్లీ రొటీన్ బాట పడుతుంది. ఇదంతా ఎన్నో సినిమాల్లో చూసిన వ్యవహారమే. విలన్లు దొరికిపోయే సన్నివేశాలన్నీ కూడా సాధారణంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో హీరో పాత్రతో ఏదో కొత్తగా చేయించాలని చూశారు కానీ.. దాని వల్ల సినిమాకు అదనపు ప్రయోజనం ఏమీ కలగలేదు. ఓవరాల్ గా చూస్తే ‘నాంది’ నరేష్ ను కొత్తగా చూపించడంలో విజయవంతమైంది కానీ.. ఓ కొత్త పాయింట్ ను పకడ్బందీగా తెరపైకి తేవడంలో మాత్రం కొంతమేరే సఫలమైంది.

నటీనటులు:

అల్లరి నరేష్ కెరీర్లో ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశాడు. అతడి కామెడీ ఇమేజ్ సినిమా మొదలైన కాసేపటికే పక్కకు వెళ్లిపోయి సీరియస్ గా ప్రేక్షకులు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుందీ పాత్ర. కామెడీ హీరో అయిన నరేష్ ఈ పాత్రకు సెట్టవ్వలేదు అనిపించకపోవడమే అతను సాధించిన విజయం. పోలీస్ స్టేషన్.. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నింటిలో అతడి నటన హృద్యంగా సాగుతుంది. ఆ పాత్ర పట్ల సానుభూతి వ్యక్తమయ్యేలా చేస్తుంది. నరేష్ కు కచ్చితంగా పెర్ఫామెన్స్ పరంగా కెరీర్ ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి. హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ రాణించింది. తమిళ యాస బాగా కలిసిపోయిన ఆమె డబ్బింగ్ ఈ పాత్రకు సూటవ్వలేదు కానీ.. నటన పరంగా ఆకట్టుకుంది. విలన్ పాత్రల్లో హరీష్ ఉత్తమన్.. వినయ్ వర్మ బాగానే చేశారు. హీరో తండ్రిగా దేవీ ప్రసాద్ తక్కువ సన్నివేశాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నాడు. హీరో స్నేహితుడిగా ప్రవీణ్ నటన బాగుంది. ప్రియదర్శి కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

శ్రీ చరణ్ పాకాల సంగీతం అతడి స్థాయికి తగ్గట్లు లేదు. ‘నాంది’లో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న రెండు మూడు పాటలు కూడా చిన్నవే. మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే ఆ పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతంలో ఉండాల్సినంత ఇంటెన్సిటీ లేదు. ఎమోషనల్ సీన్లలో ఆర్ఆర్ హృద్యంగా అనిపించినా.. హీరో పోరాటం మొదలయ్యాక బ్యాగ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను తలపించి సినిమా మూడ్ ను చెడగొడుతుంది. సిద్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. తూమ్ వెంకట్ అందించిన కథలో కొత్తదనం ఉంది. అబ్బూరి రవి మాటలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. ఇక దర్శకుడు విజయ్ కనకమేడల చాలామంది అరంగేట్ర దర్శకుల్లా సేఫ్ గా కమర్షియల్ సినిమా తీయకుండా ఇలా ఓ భిన్నమైన ప్రయత్నం చేయడం అభినందనీయమే కానీ.. ఈ భిన్నమైన కథను అనుకున్నంత పకడ్బందీగా తెరకెక్కించలేకపోయాడు. కొన్నిసార్లు ఇంటెన్స్ గా అనిపించే సినిమా.. కొన్నిసార్లు బిగి కోల్పోయినట్లు అనిపిస్తుంది. దర్శకుడిగా విజయ్ కు యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: నాంది.. కొత్త కథ-పాత కథనం!

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre