Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ : న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిస్తున్న అల్లరి నరేష్ 'నాంది'

By:  Tupaki Desk   |   30 Jun 2020 5:30 AM GMT
టీజర్ టాక్ : న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిస్తున్న అల్లరి నరేష్ నాంది
X
హాస్యభరిత చిత్రాలతో వెండితెరపై నవ్వులు పంచిన అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. నేడు అల్లరి నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘నాంది’ టీజర్‌ విడుదలైంది. సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ ఈ సినిమా టీజర్‌ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ''ఈ ప్రపంచాన్ని టీజర్‌ రూపంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. 'నాంది' చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్‌ అన్న ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు. హ్యాపీ బర్త్ డే అన్న'' అని విజయ్‌దేవర కొండ ట్విట్టర్ లో ఈ టీజర్ షేర్ చేసారు.

''దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 2015 నాటికి 1401 జైళ్లు ఉంటే 366781 మంది ఖైదీలు రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపుగా 250000 మంది తప్పు చేశామో చేయలేదో తెలియకుండానే అండర్ ట్రయిల్ కింద శిక్ష అనుభవిస్తున్నారు'' అని డైరెక్టర్ హరీష్ శంకర్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. అల్లరి నరేష్ అండర్ ట్రయిల్ ఖైదీగా జైలులో అడుగుపెట్టి అక్కడ చిత్ర హింసలు తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నంలో దారుణంగా హింసించబడుతున్నదని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ టీజర్ ద్వారా ''ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సార్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది'' అంటూ అల్లరి నరేష్‌ ప్రశ్నిస్తున్నారు.

డైరెక్టర్ విజయ్ కనకమేడల మొదటి సినిమానే మంచి కథాబలం ఉన్న స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. న్యాయవ్యవస్థ లోని లోపాలను ఎట్టి చూపేలా ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. సిద్ జే సినిమాటోగ్రఫీ మరియు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో నటిస్తుండగా.. రాధా ప్రకాశ్‌ గా ప్రియదర్శి.. పోలీస్‌ పాత్రలో హరిశ్‌ ఉత్తమన్‌.. సంతోష్‌ గా నటుడు ప్రవీణ్‌ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎస్‌.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన 'నాంది' టీజర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అల్ల‌రి న‌రేష్‌ తన శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ కథనాలతో రూపొందిన ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'నాంది' డబ్బింగ్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెట్టేసారు.