Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్స్ లో 'నదియా'దే పైచేయి!

By:  Tupaki Desk   |   16 July 2021 10:30 AM GMT
సీనియర్ హీరోయిన్స్ లో నదియాదే పైచేయి!
X
తెలుగులో నిన్నటితరం హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన కథానాయికలలో చాలామంది, కేరక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు వాళ్లకి గల గ్లామర్ .. క్రేజ్ కూడా తమ సినిమాకి కలిసొస్తుందనే ఉద్దేశంతో సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ .. కొరటాల సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తమ సినిమాల్లో కీలకమైన .. ముఖ్యమైన పాత్రల కోసం వాళ్లు సీనియర్ హీరోయిన్స్ కి ప్రాధాన్యతని ఇస్తున్నారు.

అలా ఇటీవల కాలంలో ఖుష్బూ .. సుహాసిని .. నదియా .. సుకన్య .. దేవయాని .. ఆమని .. సితార .. స్నేహ .. సంగీత కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. అయితే ఈ అందరిలోనూ 'నదియా' ఎక్కువ అవకాశాలను అందుకుంటూ వెళుతుండటం విశేషం. నిజం చెప్పాలంటే తెలుగులో నదియా చేసిన సినిమాలను వ్రేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఆ కొన్ని సినిమాల్లో కూడా భారీ విజయాలు సాధించినవి లేవు. అందువలన 'మిర్చి' సినిమా వచ్చేవరకూ, నదియా ఇక్కడ కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే గుర్తున్నారనడంలో సందేహం లేదు.

మలయాళ సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన నదియా, ఆ తరువాత అక్కడ ఒక రేంజ్ లో దూసుకుపోయారు. ఆ తరువాత తమిళ సినిమాలలోను ఆమె అదే జోరును కొనసాగించారు. ఈ రెండు భాషల్లోను స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడుతూ ఆమె ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో కూడా గ్లామర్ పరంగా గట్టిపోటీ ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో నదియా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. రెండు భాషల్లోను ఆమెకు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అయితే ఎందుకనో తెలుగులో ఆమె ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. ముఖ్యంగా స్టార్ హీరోల జోడీకట్టే ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపించదు.

అలాంటి నదియా కెరియర్లో ఓ పదేళ్లపాటు గ్యాప్ వచ్చేసింది .. అందుకు కారణం ఏమిటనేది మాత్రం తెలియదు. ఆ తరువాత ఆమె మలయాళ .. తమిళ భాషల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా తెలుగులో కొంత లేట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం ఆలస్యం చేయాలేదు. 'మిర్చి' సినిమాతో ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. నదియా గ్లామర్ లోను .. ఆమె ఫిట్ నెస్ లోను .. డీసెంట్ గా అనిపించే లుక్ లోను పెద్దగా మార్పు లేదు. పైగా ఆ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఆమె పోషించిన పాత్ర బాగా రిజిష్టర్ అయింది. దాంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

'మిర్చి' సినిమాతో ఇచ్చిన రీ ఎంట్రీ నదియాకి బాగా కలిసొచ్చింది. ఆ తరువాత 'అత్తరింటికి దారేది' సినిమాలో ఆమె పవన్ కల్యాణ్ మేనత్త పాత్రలో కనిపించారు. అయితే ఇది కేవలం మేనత్త పాత్ర మాత్రమే కాదు .. అసలు కథతో ఈ పాత్ర ముడిపడి ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా ఈ పాత్రపైనే ఉండటం వలన ప్రేక్షకులకు నదియా మరింత గుర్తుండిపోయారు. అలాగే ఇండస్ట్రీ వర్గాల దృష్టి కూడా ఆమెపై పడింది. ఫలితంగా ఆమెకి 'దృశ్యం' సినిమాలో ఒక కీలకమైన పాత్ర దక్కింది.
తన కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లిగా .. ఒక పోలీస్ ఆఫీసర్ గా హీరో ఫ్యామిలీని టార్గెట్ చేసే పాత్ర అది.

ఆవేశం .. ఆవేదనతో కూడిన ఈ పాత్రలో నదియా చూపిన నటన, ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తన కొడుకు ఏమైపోయాడో తెలుసుకోవాలనే ఆరాటం, అసలు తిరిగివస్తాడో లేదో అనే అనుమానానికి మధ్య నలిగిపోయే ఈ పాత్రలో ఆమె నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఇక ఆ తరువాత కూడా ఆమె 'బ్రూస్ లీ' .. 'అ ఆ' .. 'నా పేరు సూర్య' .. 'మిస్ ఇండియా' సినిమాల్లో నటించారు. ఈ సినిమాలను పరిశీలిస్తే తన పాత్రకి ప్రత్యేకత .. ప్రాధాన్యత ఉంటేనే ఆమె ఓకే చెప్పారనే విషయం అర్థమవుతుంది.

ప్రస్తుతం నదియా 'గని' .. 'వరుడు కావలెను' .. 'దృశ్యం 2'తో పాటు, రామ్ - లింగుసామి ప్రాజెక్టులోను కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. రామ్ సినిమాలోను ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. దర్జా .. దర్పం .. నిదానం .. నిబ్బరం .. హుందాతనంతో కూడిన పాత్రలను నదియా గొప్పగా చేస్తారనే పేరు ఉంది. ఈ సినిమాలోనూ ఆమె పాత్రలో ఆ ఛాయలు కనిపిస్తాయనేది ఇటీవల వదిలిన ఆమె లుక్ ను బట్టి అర్థమవుతోంది. సెట్స్ పై ఉన్న ఈ సినిమాలన్నీ థియేటర్లకు వస్తే, నదియా ఇక్కడ మరింత బిజీ కావడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.