Begin typing your search above and press return to search.

'మహానటి' డైరెక్టర్ నుంచి మరో సినిమా రావడానికి ఐదేళ్లు పట్టేలా ఉందే..!

By:  Tupaki Desk   |   20 Nov 2020 2:30 AM GMT
మహానటి డైరెక్టర్ నుంచి మరో సినిమా రావడానికి ఐదేళ్లు పట్టేలా ఉందే..!
X
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించాడు. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ‘మహానటి’ని అద్భుతంగా ఆవిష్కరించిన నాగ్ అశ్విన్.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రభాస్ కెరీర్ లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తారని ప్రకటించారు. దీనికి తగ్గట్టే భారీ క్యాస్టింగ్ ని ఇందులో యాడ్ చేశారు. ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని తీసుకున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లు వెల్లడించారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ని మెంటర్ గా తీసుకున్నారు. 'రాధే శ్యామ్' మూవీ పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే అదే సమయంలో 'ఆదిపురుష్' అనే మరో సినిమా ప్రకటించాడు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ అనౌన్స్ చేయడంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లేట్ కానుందనే వార్తలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ 'ఆదిపురుష్‌' చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. అదే సమయంలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండకపోవచ్చనే సందేహాలు కూడా రేకెత్తించింది. ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్‌' సినిమాని 'రాధే శ్యామ్' షూటింగ్ పూర్తైన వెంటనే స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. అంటే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా 2023 లోపు ప్రేక్షకుల ముందుకు వచ్చేది కష్టమే అని చెప్పవచ్చు. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి భారీ స్కేల్ లో రూపొందించాల్సి ఉంటుంది. టాకీ పార్ట్ పూర్తి చేయడానికి ఒక ఏడాది సమయం పట్టినా మిగతా వర్క్ చేయడానికి చాలా సమయమే పట్టనుంది. 2018లో వచ్చిన 'మహానటి' తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్న నాగ్ అశ్విన్.. తదుపరి సినిమాని మరో ఐదేళ్లకు కానీ విడుదల చేయనున్నాడన్నమాట.