Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్ K' గురించి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 4:30 PM GMT
ప్రాజెక్ట్ K గురించి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
X
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నాగ్ అశ్విన్.. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' మూవీని రూపొందించి ఘన విజయం సాధించాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ అందుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ''ప్రాజెక్ట్ - K'' వంటి పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

"ప్రాజెక్ట్ K" అనేది సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందే సూపర్ హీరో మూవీ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో విజువల్ వండర్ గా తీర్చిద్దడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది కొత్త రకమైన సినిమా కావడంతో టీమ్ అంతా ప్రతీ విషయాన్నీ కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చింది.

అందుకే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసమే చాలా సమయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది ఇండియాలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసారు. ఈ సినిమా వరల్డ్ - సెటప్ - మేకింగ్‌ - ప్రాపర్టీస్.. ప్రతిదీ పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలిపారు.

'ప్రాజెక్ట్ K' అనేది చాలా కొత్త సినిమా.. స్క్రిప్ట్ కూడా కొత్తదని నాగ్ అశ్విన్ అన్నారు. బిల్డప్ చేసే వరల్డ్ - టెక్నికల్ గా అన్నీ కొత్తవే అని.. ఒక రకంగా ఈ సినిమా ఎలా చెయ్యాలి అన్నదానికే చాలా టైం పడుతుందని దర్శకుడు పేర్కొన్నారు. సినిమా కోసం అన్నీ కొత్తగా తయారు చేస్తున్నామని వెల్లడించారు. 'మహానటి' కి కార్లు కావాలంటే రెంటుకు తీసుకురావచ్చని.. కానీ ఈ సినిమాకు వెహికల్స్ కావాలంటే ఎక్కడా దొరకవని.. కార్లు తయారు చేసుకోవాలని నాగి చెప్పుకొచ్చారు.

నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ ' సినిమా కోసం మహీంద్రా గ్రూప్ నుండి ఆటోమొబైల్ టెక్నాలజీ కావాలని ఆనంద్ మహీంద్రాను కోరిన సంగతి తెలిసిందే. సైన్స్-ఫిక్షన్ చిత్రానికి ఫ్యూచర్ ఆటోమొబైల్స్‌ ను అభివృద్ధి చేయడంలో మహీంద్రా గ్రూప్ సహాయం అవసరమని నాగ్ అశ్విన్ కోరడంతో దీనికి ఆనంద్ మహీంద్రా అంగీకరించాడు. అలానే ఇటీవల ఈ సినిమా కోసం కెమికల్ ఇంజనీర్లు - స్పెషల్ ఎఫెక్ట్స్ లేదా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి సాంకేతిక బృందం కావాలని మేకర్స్ ప్రకటన ఇచ్చారు.

ఇదంతా చూస్తుంటే ప్రభాస్ తో కలిసి నాగ్ అశ్విన్ ఏదో సరికొత్త ప్రపంచాన్ని తెర మీద ఆవిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని అర్థమవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని రూపొందిరిస్తునట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కాగా, "ప్రాజెక్ట్-K" సినిమాలో ప్రభాస్ ఒక సూపర్ హీరోగా కనిపిస్తారని తెలుస్తోంది. ఇందులో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరియు 'లోఫర్' భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

"ప్రాజెక్ట్ K" చిత్రాన్ని 2024 దసరా సీజన్ లో లేదా 2025 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పలు విదేశీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.