Begin typing your search above and press return to search.

రైల్వే మినిస్టర్ కు 'ప్రాజెక్ట్ K' డైరెక్టర్ రిక్వెస్ట్..!

By:  Tupaki Desk   |   31 May 2022 1:30 PM GMT
రైల్వే మినిస్టర్ కు ప్రాజెక్ట్ K డైరెక్టర్ రిక్వెస్ట్..!
X
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సమకాలీన అంశాలపై దేశవ్యాప్తంగా జరిగే వివిధ సమస్యలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెళ్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ డిజైన్ పై కేంద్రమంత్రిని ఉద్దేశిస్తూ నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తిరుపతికి వెళ్ళడానికి ఎక్కువ శాతం సామాన్యులు రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి హంగులతో తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

ఇందులో భాగంగానే తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణ నమూనాకు సంబంధించిన కొన్ని ఫోటోలను కేంద్ర రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ''తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేసన్ ఆన్ ఫాస్ట్ ట్రాక్.. ఆల్ కాంట్రాక్టర్స్ అవార్డెడ్'' అని ట్వీట్ చేశారు. అయితే డిజైన్లపై నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిర్మించే రైల్వే స్టేషన్ ని అలా డిజైన్ చేయడం ఏంటని రైల్వే మంత్రిని ప్రశ్నిస్తున్నారు. వారితో స్వరం కలిపిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ డిజైన్ ను ఎవరూ ఇష్టపడటం లేదని ట్వీట్ చేశారు. భారతదేశం యొక్క గొప్ప వాస్తుశిల్పాన్ని అర్థం చేసుకున్న వారితో ఈ డిజైన్లను రూపొందించాలని మంత్రిని అభ్యర్థించాడు.

"డియర్ సార్.. మీరు కామెంట్స్ లో చూసినట్లుగా దీన్ని ఎవరూ ఇష్టపడరు. డిజైన్ కొంత జెనరిక్ వెస్ట్రన్ కాపీ, కొంత ఐటీ పార్క్ లాగా ఉంది.. తిరుపతి ఎంతో పవిత్రమైనది.. ఆధ్యాత్మిక నగరం... భారతదేశం యొక్క గొప్ప నిర్మాణాన్ని అర్థం చేసుకున్న వారితో దీన్ని రూపొందించండి. ఈ గ్లాసులు, స్టీల్‌ తో చేసిన కాపీలు అవసరం లేదు” అంటూ రైల్వే మంత్రిని నాగ్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు.

నాగ్ అశ్విన్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. మరి యంగ్ ఫిలిం మేకర్స్ సూచనను రైల్వే శాఖ వారు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ''ప్రాజెక్ట్ K'' వంటి పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.