Begin typing your search above and press return to search.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగ్ దంపతులు

By:  Tupaki Desk   |   21 Jan 2022 8:57 AM GMT
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగ్ దంపతులు
X
నాగార్జున - అమల దంపతులు ఈ శుక్రవారం ఉదయం తిరుమల కొండకు చేరుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

అంతకుముందు ఆలయ అధికారులు నాగార్జున దంపతులకు ఆహ్వానం పలికారు. రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు నాగార్జున దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందించారు.

స్వామివారి దర్శనం ముగించుకుని కోవెల బయటికి వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడారు.

"కోవిడ్ కారణంగా రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకోలేకపోయాము. మళ్లీ ఇంతకాలానికి స్వామివారి ఆశీస్సులు అందుకున్నాము. కరోనా కారణంగా ప్రపంచ ప్రజలంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందువలన అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నాను" అని చెప్పుకొచ్చారు.

ఇక నాగార్జున కెరియర్ విషయానికి వస్తే, తాజాగా ఆయన 'బంగార్రాజు' బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ .. నాగచైతన్య .. కృతి శెట్టి ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

నిజానికి 'ఊపిరి' సినిమా తరువాత నాగార్జునకి హిట్ లేదనే చెప్పాలి. ఆ తరువాత ఆయన యాక్షన్ వైపు ట్రై చేద్దామనే ఉద్దేశంతో 'ఆఫీసర్' .. 'వైల్డ్ డాగ్' వంటి సినిమాలు చేశారు. 'దేవదాస్' వంటి మల్టీ స్టారర్ ను కూడా ట్రై చేశారు. తనకి అలవాటు లేని 'రాజుగారి గది 2' వంటి హారర్ టచ్ ఉన్న సినిమాను కూడా చేశారు.

ఆ సినిమాలేవీ కూడా కలిసి రాకపోవడంతో, తన కెరియర్లోనే తిరుగులేని హిట్ గా నిలిచిన 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ చేశారు. అది కూడా ఆయనకి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన నిరాశను మిగిల్చింది.

ఈ నేపథ్యంలోనే ఆయన గ్రామీణ నేపథ్యంలో తనకి కొంతకాలం క్రితం హిట్ ఇచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా సీక్వెల్ పై దృష్టిపెట్టారు.

సంక్రాంతి పండగ నేపథ్యం కలిగిన కథ కావడం వలన ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబడుతోంది.

హీరోగా .. నిర్మాతగా చాలా కాలం తరువాత నాగార్జున ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇక చైతూ కెరియర్ కి కూడా ఈ సినిమా మరింత ఊతాన్నిచ్చింది. ఈ సందర్భంగానే నాగార్జున .. అమలతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారని అనుకోవచ్చు.