Begin typing your search above and press return to search.

చైతూ మాస్ బాట పట్టాల్సిందేనా..?

By:  Tupaki Desk   |   27 July 2022 4:58 AM GMT
చైతూ మాస్ బాట పట్టాల్సిందేనా..?
X
అక్కినేని నాగచైతన్య గత నాలుగు వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉండగా.. లేటెస్టుగా వచ్చిన 'థాంక్యూ' సినిమా బ్రేక్ వేసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి తగ్గట్టుగానే ఫస్ట్ వీకెండ్ లో ఆశించిన వసూళ్ళు రాబట్టలేకపోయింది. దీంతో చైతూ తదుపరి చిత్రాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్నాళ్ళు క్లాస్ సినిమాలు పక్కన పెట్టి మాస్ బాట పట్టాలని కోరుతున్నారు.

చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ తెలుగు తమిళ బైలింగ్విల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీని తర్వాత పరశురాం - తరుణ్ భాస్కర్ వంటి దర్శకులు యువసామ్రాట్ లైన్ లో ఉన్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, నాగచైతన్య ఇప్పుడు మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు తనతో టచ్‌ లో ఉన్న దర్శకులను మాస్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించాడని టాక్ నడుస్తోంది.

నిజానికి వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న NC22 మూవీ తన స్టైల్ లో సాగే మాస్ చిత్రం అవుతుందని నాగచైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో చై ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సినిమాలో 50 శాతం యాక్షన్ ఉంటుందని.. మాస్ & యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునే ఫ్యాన్స్ ని ఇది కచ్చితంగా ఆకట్టుకుంటుందని చైతూ వెల్లడించారు.

అలానే దిల్ రాజు సైతం నాగ చైతన్యతో ఓ మాస్ మూవీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మాస్ స్క్రిప్ట్‌ ను రెడీ చేసే సరైన దర్శకుడిని కనుగొనే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. వెంటనే కాకపోతే భవిష్యత్తులో మళ్ళీ చైతన్యతో కలిసి పనిచేయడానికి అగ్ర నిర్మాత ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తోంది. సో రాబోయే రోజుల్లో చైతూ నుంచి మాస్ - యాక్షన్ చిత్రాలను ఎక్సపెక్ట్ చేయొచ్చు.

సాధారణంగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలు మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. మాస్ సినిమాలు చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది.. దానికి తగ్గట్టుగానే మార్కెట్ కూడా ఉంటుందని భావిస్తుంటారు. అందుకే ప్రతీ అభిమాని కూడా తమ హీరో అలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటారు. కానీ చైతూ మాత్రం ఎంత కష్టపడినా మాస్ ఇమేజ్ తెచుకోలేకపోతున్నాడు.

దీనికి కారణం గతంలో అలాంటి జోనర్స్ లో చైతన్య చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడం.. లవ్ స్టోరీలలో అతన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడమే అని చెప్పాలి. టాలీవుడ్ లోని అతి పెద్ద సినీ కుటుంబాల్లో ఒక్కటైన 'అక్కినేని' నట వారసుడిగా 'జోష్' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగచైతన్య. అయితే డెబ్యూ మూవీ నిరాశ పరచడం.. 'ఏమాయ చేసావే' వంటి క్లాస్ సినిమాతో హిట్టు కొట్టడంతో చై అలాంటి చిత్రాలకే సెట్ అవుతాడనే అభిప్రాయం జనాల్లో ఏర్పడింది.

దానికి తగ్గట్టుగానే 'దడ' 'ఆటోనగర్ సూర్య' 'బెజవాడ రౌడీలు' 'తడాఖా' వంటి మాస్ - యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగలగా.. '100% లవ్' 'మనం' 'ప్రేమమ్' వంటి క్లాస్ చిత్రాలు చైతూ ని హీరోగా నిలబెట్టాయి. దీంతో నవ యువసామ్రాట్ అదే బాటలో నడవాల్సి వచ్చింది.

అయితే 'మజిలీ' తర్వాత నాగచైతన్య స్క్రిప్టు సెలక్షన్ లో వెరీయేషన్ చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు 'థాంక్యూ' తో ప్లాప్ రుచి చూసాడు. అందుకే ఇప్పుడు చై కచ్చితంగా మాస్ మాత్రం జపించాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చై రాబోయే చిత్రాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.