Begin typing your search above and press return to search.

వ్యక్తిగా ఇప్పుడు చాలా మారాను: నాగ చైతన్య

By:  Tupaki Desk   |   20 July 2022 6:47 AM GMT
వ్యక్తిగా ఇప్పుడు చాలా మారాను: నాగ చైతన్య
X
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గత కొంతకాలంగా వరుస విజయాలతో దుకుపోతున్నాడు. సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా.. చై వ్యక్తిగత విషయంలో మాత్రం ఎవరూ ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య సమంతతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో అతను మరో హీరోయిన్ తో సంబంధం కలిగి ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే చై మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది.

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''థాంక్యూ'' సినిమా విడుదలకు సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. చైతన్య కూడా వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్కినేని వారసుడు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

'థాంక్యూ' కథ గురించి దర్శకుడు విక్రమ్ - రచయిత బి.వి.ఎస్. రవి - నిర్మాత దిల్ రాజు చెప్పినప్పుడు నాలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. ఇలాంటి కథల్ని విక్రమ్ చాలా బాగా డీల్ చేస్తుంటారు. 'మనం' సినిమాని ఓ కథలా చెప్పుకొంటే సింపుల్ గానే ఉంటుంది. కానీ దాన్ని విక్రమ్ ప్రెజెంట్ చేసిన తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ ఆ మ్యాజిక్ కనిపిస్తుంది అని నాగచైతన్య తెలిపారు.

16 ఏళ్ల టీనేజ్ కుర్రాడి నుంచి 36 ఏళ్ల వ్యక్తి వరకు నాలుగైదు దశల్లో ఈ సినిమాలో నా పాత్ర కనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా పలు రకాలుగా ఛాలెంజింగ్ గా అనిపించిన చిత్రమిది. అయితే 16 ఏళ్ల కుర్రాడి లుక్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ పాత్ర కోసం చాలా బరువు తగ్గాను. మూడు నెలలపాటు వర్కవుట్ చేయడంతో పాటుగా కొన్ని వర్క్ షాప్స్ కూడా చేశామని చైతూ చెప్పారు.

ఇందులో నేను మహేష్ బాబు అభిమానిగా కనిపిస్తాను. ప్రత్యేకమైన టైమ్ లైన్ లో నడిచే కథ కాబట్టి ఆ రోజుల్లో వచ్చిన మహేష్ సినిమాల్ని కవర్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. 'ప్రేమమ్' సినిమాలో మూడు దశల్లోని ప్రేమకథలు కనిపిస్తే.. ఇందులో జీవితానికి సంబంధించిన కథ కనిపిస్తుందని అన్నారు.

థాంక్యూ సినిమాలో నటిస్తూ వ్యక్తిగా చాలా మారానని చైతన్య చెప్పారు. ఇంతకుముందు తాను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదని.. మనసులో ఉన్న విషయాల్ని సగమే బయటికి చెప్పేవాడినని.. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ వద్ద ఏదైనా అనిపిస్తే ఓపెన్ గా చెప్పేస్తున్నానని అన్నారు.

అమీర్ ఖాన్ తో కలిసి 'లాల్ సింగ్ చద్దా' సినిమా చేయడం గురించి మాట్లాడుతూ.. ఆయనతో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా చిరంజీవి సమర్పణలో రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది అని నాగచైతన్య చెప్పారు. కొత్తగా హిందీ సినిమాలేవీ ఒప్పుకోలేదని.. ముందు తనను బాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయాలని.. అప్పుడే హిందీ చిత్రాల గురించి ఆలోచిస్తానని తెలిపారు.

కరోనా కారణంగా ఇంట్లో కూర్చుని సినిమాని ఆస్వాదించడం అలవాటైంది. అందులో తప్పేమీ లేదు. టైం అలా మార్చింది. ఇప్పుడు పరిశ్రమగా మేం దానికి తగ్గట్టుగా మారాలి. ప్రేక్షకుడిని మళ్లీ థియేటర్కి తీసుకురావాలంటే దానికి తగ్గట్టుగా కంటెంట్ సిద్ధం చేయాలి. ట్రైలర్, టీజర్లోనే ఓ ప్రత్యేకతని చూపించాలి అని అన్నారు.

సినిమాపై పెట్టుబడి తీరు కూడా మారాలి. అందరూ తమ రెమ్యునరేషన్లను లాభాల నుంచి తీసుకునేలా మాట్లాడుకోవాలి. ఓటీటీల్లో రిలీజ్ చేయడంపైనా అందరూ మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకోవాలి అని చైతూ అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమాలో పోలీస్ గా కనిపించనున్నట్లు వెల్లడించారు. 'దూత' వెబ్ సిరీస్ లో తన భాగం షూటింగ్ పూర్తయిందని నాగచైతన్య తెలిపారు.