Begin typing your search above and press return to search.

నాన్న చాలా వ‌ర‌కు కంట్రోల్ చేశారు

By:  Tupaki Desk   |   13 Jan 2022 6:30 AM GMT
నాన్న చాలా వ‌ర‌కు కంట్రోల్ చేశారు
X
కింగ్ నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌లిసి ఈ సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `బంగార్రాజు`. నాగ్ తో క‌లిసి చై న‌టించిన రెండవ చిత్ర‌మిది. తొలి సారి అక్కినేని ఫ్యామిలీ చిత్రం `మ‌నం`లో క‌లిసి న‌టించారు. ఆ త‌రువాత చేస్తున్న సినిమా ఇదే. `సోగ్గాడే చిన్నినాయ‌న‌` కు ప్రీక్వెల్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల డైరెక్ట్ చేసిన ఈ మూవీని జీ స్టూడియోస్ తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై కింగ్ నాగార్జున నిర్మించారు.

ఈ శుక్ర‌వారం జ‌న‌వ‌రి 14న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా హీరో నాగ‌చైత‌న్య ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. `మ‌నం` చిత్రంలో నాన్న‌, తాత‌య్య‌తో క‌లిసి న‌టిస్తున్న‌ప్ప‌డు భ‌యం వేసింద‌ని, అయితే ఆ అనుభ‌వం `బంగార్రాజు`కు బాగా క‌లిసొచ్చింద‌ని, ఆ అనుభ‌వం వ‌ల్లే భ‌యం లేకుండా నాన్న‌తో క‌లిసి చాలా ఫ్రీగా న‌టించ‌గ‌లిగాన‌ని చెప్పాడు. బంగార్రాజు పాత్ర‌ని ఓన్ చేసుకోవ‌డానికి `సోగ్గాడే చిన్ని నాయ‌న‌` చిత్రాన్ని చాలా సార్లు చూశాన‌ని, అది త‌న‌కు చాలా హెల్ప్ అయింద‌ని, ఈ విష‌యంలో నాన్న, క‌ల్యాణ్ కృష్ణ చాలా హెల్ప్ చేశార‌ని చెప్పుకొచ్చాడు.

చిన‌బంగార్రాజు పాత్ర‌లో ప్ర‌త్యేక‌మైన స‌న్నివేశాల్లో ఎలా న‌టించాలో నాన్న‌ని అడిగి తెలుసుకున్నాన‌ని, దాంతో త‌న‌కు చాలా ఈజీ అయిపోయింద‌న్నారు. సినిమాలో రెండు పాత్ర‌లు స‌మానంగానే వుంటాయ‌ని, అయితే నాన్న పోషించిన బంగార్రాజు పాత్రే సినిమాకు కీల‌కం. ఆయ‌న‌ది గెస్ట్ రోల్ కాదు. చిన బంగార్రాజు ఎంట్రీతో కొత్త క‌థ మొద‌ల‌వుతుంది. ఇందులో నా పాత్ర చాలా నాటీగా వుంటుంది. అయితే నాన్న చాలా వ‌ర‌కు కంట్రోల్ చేశారు. రాము పాత్ర యుఎస్ లో వుంటుంది. దాంతో ఇద్ద‌రం ఫోన్ లో మాట్లాడుకుంటాం` అని తెలిపాడు చై.

ఇక పండ‌గ సినిమా అంటే క‌ల‌ర్‌ఫుల్ సాంగ్‌ల‌తో మ‌రింత క‌ల‌ర్ ఫుల్ గా వుండాల‌ని, అంత‌కు మించి కొరియోగ్ర‌ఫీ కూడా అంతే అందింగా వుండాల‌ని భావించాం. ఈ మూవీలోని ప్ర‌తీ పాటకు అద్భుత‌మైన కొరియోగ్ర‌ఫీ కుదిరింది. సినిమాలోని పాట‌ల కోసం చాలా వ‌ర‌కు గ్రామీణ నేప‌థ్యంలో రూపొందిన చిత్రాల‌ని ప‌రిశీలించాం` అన్నారు. ఇక సినిమాలో కృతిశెట్టికి త‌న‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల గురించి చెబుతూ `ఈగో కార‌ణంగా ఇద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ద‌ని, అయితే అది సెకండ్ హాఫ్ లో ప్రేమ‌గా మారుతుందన్నాడు. ఈ సంద‌ర్భంగా చైతూ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

షూటింగ్ కి ముందే టికెట్ రేట్ల‌ని బ‌ట్టి ముందే బ‌డ్జెట్ ని ప్లాన్ చేశార‌ట‌. టికెట్ రేట్ల గురించి నాన్న‌తో చ‌ర్చించాను. ఏప్రిల్ లో జీవో వ‌చ్చింది. ఆ టికెట్ రేట్ల‌కు త‌గ్గ‌ట్టే బ‌డ్జెట్ ప్లాన్ చేశాం. ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించాం. ఒక వేళ టికెట్ రేట్లు పెరిగితే అది మాకు బోన‌స్ అవుతుందని ముందే భావించాం. కృతిశెట్టి కి మంచి పేరొస్తుంది. ఆమె పోషించిన నాగ‌ల‌క్ష్మి పాత్ర కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కృతి గుడ్‌ ఆర్టిస్ట్. నాగ‌ల‌క్ష్మి పాత్ర కోసం త‌ను చాలా హోమ్ వ‌ర్క్ చేసింది. ఆమె నిబ‌ద్ధ‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే.. అంత‌లా ఈ పాత్ర కోసం వ‌ర్క్ చేసిందని తెలిపారు చైతూ.

సినిమాలో 35 నిమిషాల పాటు వీఎఫ్ ఎక్స్ సీన్స్ వుంటాయ‌ని, సినిమా ప్రారంభంలో వ‌చ్చే సునామీ సీన్స్ ఆక‌ట్టుకుంటాయ‌న్నాయ‌ని తెలిపిన నాగ‌చైత‌న్య ఈ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కు సంబంధించిన వివ‌రాల్ని కూడా వెల్ల‌డించారు. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ తో క‌లిసి చేస్తున్న `లాల్ సింగ్ చ‌ద్దా` షూటింగ్ ఇప్ప‌టికే పూర్తయింది. ఈ మూవీలో అమీర్‌ఖాన్‌తో క‌లిసి న‌టించ‌డం జీవిత కాల అనుభూతినిచ్చింద‌న్నాడు చైతూ.

ఇక విక్ర‌మ్ కుమార్ తో చేస్తున్న `థ్యాంక్యూ` షూటింగ్ చివ‌రి స్టేజ్ లో వుంద‌ని, ప‌ర‌శురామ్‌తోనూ ఓ మూవీ చేయ‌బోతున్నాన‌న్నారు. మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` త‌రువాత మా సినిమా వుంటుంద‌ని తెలిపారు. హార‌న్ సినిమాలంటే నాకు భ‌యం కానీ హార‌ర్ జోన‌ర్ లో వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాన‌ని, దీన్ని విక్ర‌మ్ కుమార్ డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని, ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని, `నాంది` ఫేమ్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాన‌ని, అయితే స్క్రిప్ట్ ఫైన‌ల్ కాలేద‌ని స్ప‌ష్టం చేశాడు నాగ‌చైత‌న్య‌.