Begin typing your search above and press return to search.

చై-సామ్.. నిజజీవితంలో మాదిరే..

By:  Tupaki Desk   |   13 July 2018 5:59 AM GMT
చై-సామ్.. నిజజీవితంలో మాదిరే..
X
‘ఏమాయ చేసావె’.. ‘మనం’ సినిమాలతో మెస్మరైజ్ చేసింది అక్కినేని నాగచైతన్య-సమంతల జంట. తెరపై ప్రేమను అద్భుతంగా పండించిన ఈ జంట.. నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారి.. పెళ్లి వైపు అడుగులేసింది. పెళ్లి తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించే సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’లోనే ఇద్దరూ కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. ఐతే త్వరలోనే వీళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో చై-సామ్ కలిసి నటించబోతున్నారు. విశేషం ఏంటంటే.. ఇందులో వీళ్లిద్దరూ నిజ జీవితంలో మాదిరే భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు.

‘నిన్ను కోరి’లో చాలా పరిణతితో ప్రేమకథను తీర్చిదిద్దిన శివ.. మరోసారి మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో రాబోతున్నాడట. చై-సామ్ ఇందులో నేరుగా భార్యాభర్తలుగా కనిపిస్తారట. పెళ్లి తర్వాత ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. తాను.. సమంత ఇప్పటికే భార్యభర్తలమని.. అలాంటపుడు తాను సినిమాలో లవర్ బాయ్ గా మారి.. సమంత వెంట పడితే చూడటానికి బాగోదని చైతూ అన్నాడు. తమను భార్యాభర్తలుగా చూపించబోతున్నట్లు శివ చెబితేనే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలిపాడు. తమ ఇద్దరి కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చైతూ చెప్పాడు. ఐతే ఈ చిత్రం వెంటనే మొదలయ్యేలా కనిపించడం లేదు. ‘సవ్యసాచి’.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్న చైతూ.. దీని తర్వాత తన మావయ్య వెంకటేష్ తో మల్టీస్టారర్ షూటింగులో పాల్గొంటాడు. మరోవైపు సమంత చేతిలో ఉన్న కమిట్మెంట్లను పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.