Begin typing your search above and press return to search.

రిలీజ్ డే.. ఇంత డైల‌మా మునుపెన్న‌డూ లేదే!

By:  Tupaki Desk   |   27 Aug 2021 4:30 PM GMT
రిలీజ్ డే.. ఇంత డైల‌మా మునుపెన్న‌డూ లేదే!
X
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ అయితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ఇటీవ‌ల విడుద‌లైన రెండు సినిమాల్ని ఉద‌హ‌రించ‌వ‌చ్చు. బాలీవుడ్ లో కిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన `బెల్ బాట‌మ్` భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి రోజు వ‌సూళ్లు...వారంతం వ‌సూళ్లు చూస్తూ బాక్సాఫీస్ కే దిమ్మ తిరిగిపోయింది. అంత పేల‌వ‌మైన వ‌సూళ్ల‌తో బెల్ బాట‌మ్ స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక తెలుగులో శ్రీ విష్ణు న‌టించిన `రాజ రాజ చోర` ఎలాంటి అంచ‌నాలు లేకుండానే విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

కానీ థియేట‌ర్ కు వెళ్లి సినిమా చూసే వాళ్లే క‌రువ‌య్యారు. ఆ ర‌కంగా రెండు సినిమాలు థియ‌ట‌ర్లో రిలీజ్ అయి న‌ష్టాల భారీన ప‌డాల్సి వ‌చ్చింది. దీనికి కార‌ణాలు ఎన్ని ఉన్నా క‌రోనా అన్న‌ది ప్ర‌ధాన కార‌ణమ‌ని అంద‌రికీ తెలుసు. ఆ రెండు సినిమాలు చూడ‌టానికి జ‌నాలు పెద్ద‌గా వెళ్ల‌లేదు. ఏపీలో టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌టం స‌హా కొన్ని కీల‌క‌మైన కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా మెయిన్ ఫ్యాక్ట‌ర్ అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆ సంగ‌తి ఎలా ఉన్న‌ప్పటికీ తాజాగా సెప్టెంబ‌ర్ తొలి వారంలో రిలీజ్ అనుకున్న సినిమాలు కూడా ఇప్పుడు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `లవ్ స్టోరి` ఇప్ప‌టికి ఎన్నిసార్లు వాయిదా పడిందో చెప్పాల్సిన ప‌నిలేదు. చివ‌రిగా సెప్టెంబ‌ర్ 10న రిలీజ్ చేయాల‌ని ముహూర్తం ఫిక్స్ చేసారు. కానీ తాజా ప‌రిస్థితుల న‌డుమ అన్నింటినీ బేరీజు వేసుకుని వెన‌క్కి వెళ్లిన‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది. అలాగే సెప్టెంబ‌ర్ 3న గోపీచంద్ న‌టించిన `సీటీమార్` ని రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఇప్పుడా సినిమా 10 సెప్టెంబ‌ర్ కి వాయిదా ప‌డిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇందులో వాస్త‌వాలు ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది. నితిన్ మాస్ట్రో.. కంగ‌న త‌లైవి.. నాని ట‌క్ జ‌గ‌దీష్ సెప్టెంబ‌ర్ రిలీజ్ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్నిటికి రిలీజ్ తేదీల‌పై ఇంకా ర‌క‌ర‌కాల డైమ‌మాలు కొన‌సాగుతున్నాయి.