Begin typing your search above and press return to search.

నాన్నా నువ్వు ఫెంటాస్టిక్‌.. న‌వ్వించావ్‌.. ఏడ్పించావ్‌

By:  Tupaki Desk   |   29 Sep 2021 4:30 AM GMT
నాన్నా నువ్వు ఫెంటాస్టిక్‌.. న‌వ్వించావ్‌.. ఏడ్పించావ్‌
X
అక్కినేని నాగ‌చైత‌న్య‌.. సాయిప‌ల్ల‌వి జంట‌గా సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన `ల‌వ్ స్టోరి` చిత్రం ఈ నెల 24న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తున్న విష‌యం తెలిసిందే. తొలి రోజు డివైడ్ టాక్ తో మొద‌లైన ఈ మూవీ త‌రువాత త‌రువాత హిట్ టాక్ కి మారింది. ఓవ‌ర్సీస్‌లో ఈ మూవీ రికార్డు స్థాయి ప్రారంభ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం విశేషం. దీంతో చిత్ర బృందం సంబ‌రాల్లో మునిగితేలుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ నెల 28న స‌క్సెస్ మీట్ ని నిర్వ‌హించారు.

ఆ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇది `ల‌వ్ స్టోరీ` స‌క్సెస్ మీట్ అనేకంటే ఒక హ్యుమానిటీ స‌క్సెస్ మీట్ అనిపిస్తోంది. మార్చి 2020 నుంచి క‌రోనాతో పోరాడుతున్నామ‌ని దాదాపుగా ఏడాది పూర్తి కావ‌స్తోంద‌ని .. దాని నుంచి బ‌య‌ట‌ప‌డ్డాం అనేలోగానే సెకండ్ వేవ్ ముంచుకొచ్చింద‌ని.. అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు స‌రైన స‌మ‌యంలో స‌రైన తీరులో స్పందించి క‌రోనాపై పోరులో ముందుండి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారన్నారు. 208 రోజుల త‌రువాత తెలంగాణ‌లో డెత్ లు లేవ‌ని తెలిసి సంతోషించాన‌న్నారు. ఏపీతో పాటు దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని ముందుగా అందుకు మ‌నం సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని తెలిపారు.

ల‌వ్‌స్టోరీ స‌క్సెస్ గురించి ఎక్క‌డి నుంచి మొద‌లు పెట్టాలో తెలియ‌డం లేద‌న్న నాగార్జున ఈ సినిమా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే కాకుండా యావ‌త్ దేశ సినిమా ప‌రిశ్ర‌మ‌కే ఉత్సాహాన్నిస్తోంద‌న్నారు. ల‌వ్‌స్టోరీ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయ‌లు అంటే మంచి సినిమా ఇస్తే థియేట‌ర్ల‌కు రావ‌డానికి తాము సిద్ధంగా వున్నామ‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి నిరూపించార‌ని తెలిపారు. కోవిడ్ ఒక్క‌టే కాదు.. తుఫాన్‌.. సైక్లోన్ వ‌చ్చిన‌ప్పుడు కూడా మ‌న వాళ్లు సినిమాకు అండ‌గా నిలిచారన్నారు. ఇక ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల నుంచి మ‌నం సంస్కారం నేర్చుకోవాల‌ని ఎందుకంటే ఆయ‌న పేరు పేరునా టీమ్ అంద‌రికీ చెప్పారని.. స‌క్సెస్ కిక్ లో మేము అంతా మ‌ర్చి పోతాం కానీ శేఖ‌ర్ మాత్రం అలా కాదు.. అత‌ని మాన‌వ‌త్వం సూప‌ర్బ్ అని ప్ర‌శంస‌లు కురిపించారు.

`ల‌వ్ స్టోరీ` ఊరికే హిట్ట‌వ‌లేదు. సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశం బ్యూటిఫుల్ గా వుంద‌ని.. సినిమా కోసం ఏవేవో లొకేష‌న్స్ అవ‌స‌రం లేదు కేవ‌లం టెర్రాస్ చాలు మంచి సినిమా చేసేందుక‌ని శేఖ‌ర్ క‌మ్ముల చూపించార‌న్నారు. ఈ సినిమాలో ప్ర‌స్థావించిన సంఘ‌ట‌న‌ల గురించి క‌నీసం చ‌ద‌వ‌డానికి కూడా తాను ఇష్ట‌ప‌డ‌న‌ని.. కానీ అలాంటి అంశాల్ని శేఖ‌ర్ చూపించిన విధానం సూప‌ర్ అన్నారు. సినిమా చూశాక రెండు మూడు రోజులు అదే భావోద్వేగాల‌కు లోన‌య్యాన‌న్నారు. ఇక పవ‌న్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించార‌ని త‌ను ఏ.ఆర్‌. రెహ‌మాన్ శిష్యుడు అని తెలిసింది అందుకే ఈ సినిమా పాట‌లు మిలియ‌న్‌లు పోయాయ‌ని నాగార్జున తెలిపారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం.. మంగ్లీ పాట‌లు పాడిన తీరు బ్యూటిఫుల్ అన్నారు.

సాయి ప‌ల్ల‌వి ఓ అద్భుత‌మైన న‌టి. ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఒక స్పిరిట్ క‌నిపిస్తుంద‌ని..ఆమె చుట్టూ వంద సాయి ప‌ల్ల‌విలు డ్యాన్స్ చేస్తున్నట్టుగా వుంటుంద‌ని.. త‌ను ఏ క్యారెక్ట‌ర్ చేసినా ఓ మ్యాజిక్ వుంటుంద‌ని.. ఆమెక‌ది ఓ వ‌రం అని చెప్పుకొచ్చారు. చైత‌న్య గురించి మాట్లాడుతూ త‌న‌ని చూస్తుంటే క‌డుపు నిండిపోతోంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. యాక్ట‌ర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫ‌రెంట్ ప‌దాలు. చైత‌ని ఒక స్టార్ యాక్ట‌ర్ గా చూపించావ్‌.. కొత్త జ‌ర్నీని అందించావ్. నాన్నా నువ్వు ఫెంటాస్టిక్‌.. సినిమా చూస్తూ నేను న‌వ్వేలా.. ఏడ్చేలా చేశావ్ అంటూ పుత్ర ప్రేమ‌తో మురిసిపోయారు నాగార్జున‌.

`ప్రేమ‌న‌గ‌ర్‌` విడుద‌లై 50 ఏళ్ల‌వుతోంద‌ని చెప్పిన నాగార్జున ఈ సినిమా విడుద‌లైన రోజునే `ల‌వ్ స్టోరీ` రిలీజ్ అయ్యింద‌ని.. ప్రేమన‌గ‌ర్‌` టైమ్‌లోనూ తుఫాన్‌.. సైక్లోన్ అన్నీ వున్నా ఆ సినిమా నాన్న‌గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింద‌న్నారు. అదే ప‌రిస్థితుల‌తో పాటు కోవిడ్ విప‌రీత ప‌రిస్థితుల్లోనూ `ల‌వ్ స్టోరీ` గొప్ప విజ‌యాన్ని సాధించింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఓ విష‌యాన్ని విన్న‌విస్తున్నాన‌ని మ‌మ్మ‌ల్ని ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ల్ల‌ని చూపుతో చూశార‌ని.. అదే పంథాని కొన‌సాగించాల‌ని...మాస్కులు లేకుండా షేక్ హ్యాండ్ లు ఇచ్చి ఆ త‌రువాత చేతులు క‌డుక్కునే రోజులు త్వ‌ర‌గా పోవాల‌ని నాగ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.