Begin typing your search above and press return to search.

ప్రేమ మైకంలో ముంచేసే పాటలొచ్చేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   18 Sept 2016 11:43 AM IST
ప్రేమ మైకంలో ముంచేసే పాటలొచ్చేస్తున్నాయ్
X
ఈ దసరాకు రాబోయే సినిమాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్నది ‘ప్రేమమ్’. గత ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయి.. సౌత్ ఇండియా మొత్తాన్ని ఊపేసిన ‘ప్రేమమ్’కు రీమేక్ ఇది. ‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి దర్శకత్వంలో.. లవ్ స్టోరీల స్పెషలిస్టు నాగచైతన్య కథానాయకుడిగా ఈ సినిమా మొదలవడంతో ఆరంభం నుంచి ఈ చిత్రంపై జనాల్లో ఎంతో ఆసక్తి ఉంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాతే విడుదల చేయాలన్న షరతు వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ఐతే ఆ సినిమా సంగతి వదిలేసి.. దసరాకు తన సినిమాను రిలీజ్ చేసేయాలని ఫిక్సయిపోయాడు నిర్మాత. ఈ సినిమా ప్రోమోస్ అన్నీ కూడా ప్లెజెంట్ గా ఉండటంతో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

ఇప్పటికే ‘ఎవరే’ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుని ఆడియో మీద అంచనాల్ని పెంచింది. ఇక ఫుల్ ఆడియో వినడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు రోజుల్లోనే ‘ప్రేమమ్’ ఆడియో విడుదల కాబోతోంది. ఈ నెల 20న హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో వేడుక చేయడానికి ప్లాన్ చేశారు. ఏఎన్నార్ ప్రేమకథల వారసత్వాన్ని చైతూ కొనసాగిస్తూ చేసిన ‘ప్రేమమ్’ అంటూ టీవీల్లో.. సోషల్ మీడియాలో ప్రోమోస్ హల్ చల్ చేస్తున్నాయి. ‘ప్రేమమ్’ ఒరిజనల్ కు సంగీతాన్నందించిన రాజేశ్ మురుగేశన్ తో పాటు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. భలే భలే మగాడివోయ్.. ఊపిరి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేసిన గోపీసుందర్ కూడా ఈ సినిమాకు సంగీతాన్నందించాడు. ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆడియో మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి పాటలు ఏమాత్రం ప్రేమ మైకంలో ముంచెత్తుతాయో చూడాలి.