Begin typing your search above and press return to search.

‘మహానటి’కి ఏఎన్నార్ దొరికేశాడు

By:  Tupaki Desk   |   11 March 2018 10:47 AM IST
‘మహానటి’కి ఏఎన్నార్ దొరికేశాడు
X
సావిత్రిగా కీర్తి సురేష్.. జమునగా సమంత.. జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్.. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు.. నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్.. ఇలా ‘మహానటి’లో కీలక పాత్రలకు మంచి మంచి నటుడే దొరికారు. కానీ ఎన్టీఆర్-ఏఎన్నార్ పాత్రల విషయంలోనే మొదట్నుంచి అయోమయం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను.. ఏఎన్నార్ పాత్రకు నాగచైతన్యను తీసుకోవాలని భావించింది చిత్ర బృందం. ఐతే తన తాత పాత్ర చేయడానికి చైతూ ఒప్పుకున్నాడు కానీ.. ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తారక్ అంగీకరించలేదు. అశ్వినీదత్ స్వయంగా అడిగినా తారక్ నో అంటే నో అనేశాడు. దీంతో చైతూ కూడా ఒక దశలో ఏఎన్నార్ పాత్ర చేయడానికి విముఖంగానే కనిపించాడు.

తారక్ ఏమైనా మనసు మార్చుకుంటాడేమో అని చూసినా ఫలితం లేకపోయింది. ఐతే తాజా సమాచారం ఏంటంటే.. ఎన్టీఆర్ సంగతెలా ఉన్నప్పటికీ తాను ఏఎన్నార్ పాత్రలో కనిపించడానికి చైతూ ఓకే చెప్పాడట. తన మీద తీసే సన్నివేశాల కోసం రెండు రోజులు డేట్లు కూడా కేటాయించాడట. తాతలా కనిపించడానికి అతనిప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మరి ఎన్టీఆర్ పాత్రను ఇంకెవరితో అయినా చేయిస్తారా ఇంతకుముందు అనుకున్నట్లుగా డిజిటల్ రూపంలో ఎన్టీఆర్‌ ను చూపించి లాగించేస్తారా అన్నది చూడాలి. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్నందిస్తున్నాడు. ఈ చిత్రం వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది.