Begin typing your search above and press return to search.

ముందే ప్రేమమ్ పాటల విందు

By:  Tupaki Desk   |   20 Sept 2016 3:39 PM IST
ముందే ప్రేమమ్ పాటల విందు
X
ఈ రోజు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవడు నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమా ఆడియో విడుదల కాబోతోంది. ఈ వేడుకకు ఏర్పాట్లు ఘనంగానే జరుగుతున్నాయి. ఐతే ఆడియో వేడుకకు ముందే ఈ సినిమా పాటల్ని యూట్యూబ్ లో రిలీజ్ చేసేసింది ‘ప్రేమమ్’ టీమ్. మలయాళంలో ‘ప్రేమమ్’ ఆడియో సూపర్ డూపర్ హిట్టవడం.. ఇది మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో తెలుగు ‘ప్రేమమ్’ ఆడియో మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఈ పాటల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లను మరీ ఎక్కువ నిరీక్షించేలా చేయకుండా ఆడియో వేడుకకు ముందే పాటల్ని ఆన్ లైన్లోకి తెచ్చేశారు.

ఇంతకుముందు ‘ఎవరే ఎవరే..’ పాట ఎంత ఫేమస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ పాట కూడా శ్రోతల్ని ఆకట్టుకుంది. వీటితో పాటుగా ఆడియోలో ఇంకో ఐదు పాటలున్నాయి. రింగు జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్ ను పొగిడేస్తూ చూతూ పాడే అగరొత్తుల కురులే వలగా విసిరేశావే.. కొంచెం జోష్ ఉన్న పాటలా అనిపిస్తోంది. నిన్న లేని కంటి చూపే.. అంటూ మలయాళ ‘ప్రేమమ్’లోని ట్యూన్ లో ఓ పాట ఉంది. ప్రేమ పూసెనోయ్.. వాడిపోయెనోయ్.. రెక్కలన్ని వాలిపోయెనోయ్.. అంటూ హుషారైన పాట వినడానికి చాలా హాయిగా అనిపిస్తోంది. ఎన్నోసార్లు నా పేరే విన్నా.. ఇంతందంగా నీ నోటే వింటూ ఉన్నా.. కూడా మంచి మెలోడీనే. ఎవడు ఎవడు.. అంటూ సాగే పాట ఫాస్ట్ బీట్ తరహాలో ఉంది. మొత్తంగా రాజేశ్ మురుగేశన్-గోపీసుందర్ కలిసి అందించిన ఆడియో అంచనాలకు తగ్గట్లే మెప్పించేలా ఉంది.