Begin typing your search above and press return to search.

కుర్రాడు మరీ ఇంత తుంటరోడా..

By:  Tupaki Desk   |   2 Sep 2016 9:30 AM GMT
కుర్రాడు మరీ ఇంత తుంటరోడా..
X
యంగ్ హీరోల్లో మాంచి అందగాడిగా నాగశౌర్యని చెప్పుకోవాలి. ఊహలు గుసగుసలాడే.. కళ్యాణ వైభోగమే.. ఒక మనసు.. ఇలా లవ్ స్టోరీలకు నాగశౌర్య కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. ఇప్పుడు జ్యో అచ్యుతానందతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ కుర్రాడు.. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో మహా యాక్టివ్ గా పాల్గొంటూ.. పర్సనల్ సంగతులు కూడా పంచుకుంటున్నాడు.

చిన్నపుడు హోమ్ వర్క్ చేయడం అంటే నాగశౌర్యకి తెగ చిరాకు వచ్చేసేదట. అందుకే దాన్ని తప్పించుకోవడానికి రకరకాల నాటకాలు ఆడేవాడిని అంటున్నాడు. 'నన్ను ఇంట్లో వదిలేసి హోమ్ వర్క్ చెయ్యమని చెప్పి అమ్మానాన్న బయటికెళ్లేవారు. కాని నేను ఆడుకునేవాడినంతే. వాళ్లు తిరిగొచ్చాక హోమ్ వర్క్ గురించి అడిగితే కరెంట్ పోయిందని చెప్పేవాడిని. కొన్నాళ్ల తర్వాత ఇంట్లో ఇన్వర్టర్ బిగించడంతో.. ఆ అబద్ధం చెప్పడానికి లేకుండా పోయింది. ఆ సమయంలో చదువు తప్పించుకునేందుకు నేను ఓ పన్ను బలవంతంగా పీకేసుకున్నా. విపరీతమైన నొప్పి అనిపించినా.. చదివే పని లేదు కాబట్టి హ్యాపీనే' అని చెప్పిన నాగశౌర్య ఇప్పటికీ ఆ నొప్పి ఉందని అన్నాడు.

అవసరాలు శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన జ్యో అచ్యుతానంద ట్రైలర్ ని చూసి.. అందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటున్నారని.. కానీ అదిరిపోయే థ్రిల్ సినిమాలో ఉంటుందంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు కుర్ర హీరో నాగశౌర్య.