Begin typing your search above and press return to search.

టైటిల్ లుక్: అశ్వ‌ద్ధామ‌.. ప్ర‌యోగ‌మా?

By:  Tupaki Desk   |   27 Oct 2019 7:39 AM GMT
టైటిల్ లుక్: అశ్వ‌ద్ధామ‌.. ప్ర‌యోగ‌మా?
X
అశ్వ‌ద్ధామ‌.. ఇదీ యువ‌హీరో నాగ‌శౌర్య టైటిల్. ఈ టైటిల్ ని అత‌డు త‌న సినిమాకి ఎంచుకున్నాడు అన్న‌ది ఇదివ‌ర‌కే లీకైంది. అప్ప‌టినుంచే ఈ చిత్రంపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భార‌తంలో అశ్వ‌ద్ధామ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దుష్ట‌స‌హ‌వాసం చేసిన అత‌డి వ‌ల్ల ఎన్నో ప‌రిణామాలు ర‌క్తి క‌ట్టించాయి పురాణంలో. అందుకే అలాంటి గొప్ప లైన్ తీసుకుని న‌టిస్తున్నాడా? అంటూ అంద‌రిలో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా అశ్వ‌ద్ధామ టైటిల్ పోస్ట‌ర్ ని దీపావ‌ళి కానుక‌గా శౌర్య బృందం రివీల్ చేసింది. ప్ర‌త్యేకించి నిర్మాత‌లు ఉష ముల్పురి -ప్ర‌సాద్ బృందం దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఈ చిత్రానికి ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 2020 రిలీజ్ అంటూ పోస్ట‌ర్ పై ప్ర‌క‌టించారు. మ‌నోజ్ హెచ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

అశ్వ‌ద్ధామ పాత్ర ప్ర‌త్యేక‌త గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మహాభారతంలో ఒక్కో పాత్ర ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. ఈ పురాణేతిహాసంలో యోధులుగా చెప్పుకునే వారిలో ఒకడు అశ్వద్ధామ. కురు పాండవులకు గురువైన ద్రోణాచార్యుడి కుమారుడు. బ్రహ్మాస్త్రాన్ని సాధించిన కొద్దిమంది వీరులలో ఒకడు. కానీ అశ్వద్ధామకు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునే శక్తి మాత్రం లేదు. అతడిని కూడా అర్జునితో సమానమైన విలుకాడిగా తీర్చిదిద్దేందుకు ద్రోణాచార్యుడు ప్ర‌య‌త్నించినా అశ్వద్ధామ చిన్నప్పటి నుంచే దుర్యోధనాదుల జట్టు కట్టి పాండవుల పట్ల విముఖత ప్రదర్శించేవాడు. అందువల్ల అతడికి తండ్రి నుంచి అందాల్సినంత విద్య అందలేదు. ఫలితంగా అర్జునుడికి సమఉజ్జీ కాలేకపోయాడు. దుర్యోధనునికి సంతోషం కలిగించడం కోసం నిద్రలో ఉన్న పాండవుల ఐదుగురి కుమారుల తలలు ఖండించాడు. కన్నకొడుకులంతా అశ్వద్ధామ ఖడ్గానికి బలైపోయారని ద్రౌపది దుఃఖాన్ని సహించలేకపోయింది. అర్జునుడు త‌న‌ని శాంతింప‌జేసి అశ్వ‌ద్ధామ‌ను చంపేందుకు వెళ‌తాడు. అర్జునుడి చేతిలో చావ‌బోయి కృష్ణుడు ఆప‌డంతో అశ్వ‌ద్ధామ బ‌తికిపోతాడు. అయితే ఈ థీమ్ నుంచి శౌర్య సినిమాకి ఏం తీసుకున్నారు? అన్న‌ది వేచి చూడాలి.