Begin typing your search above and press return to search.

పెళ్లి నేపథ్యం 'వరుడు' కి కూడా హిట్ ఇస్తుందా..?

By:  Tupaki Desk   |   26 Oct 2021 8:09 AM GMT
పెళ్లి నేపథ్యం వరుడు కి కూడా హిట్ ఇస్తుందా..?
X
కొన్ని సినిమాల నేపథ్యాలు ఒకే తరహాలో ఉన్నప్పటికీ.. అందులోని కథ - పాత్రలు - వాటి మధ్య భావోద్వేగాలు - వినోదం.. ఇలా వేటికవే భిన్నంగా కొత్తగా ఉంటే విజయం దక్కినట్లే. ఇప్పుడు తెలుగులో 'పెళ్లి' కాన్సెప్ట్ తో మూడు సినిమాలు వచ్చాయి. పెళ్లి చూపులు - పెళ్లంటే కన్ఫ్యూజన్ - క్లారిటీతో ఉండే హీరోయిన్ - హీరోయిన్ క్యారెక్టర్ కి పడిపోయే హీరో.. ఇలాంటి అంశాలతో రూపొందిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. అయితే ఈ సినిమాలో రిలేషన్స్ - ఎమోషన్స్ గురించి మాట్లాడే సరికి.. ఈ కథ కాస్తా జనాలకి బాగా కనెక్ట్ అయింది. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇదే లైన్ లో ఆల్రెడీ 'షాదీ ముబారక్' అనే సినిమా వచ్చేసింది.

ఇప్పుడు తాజాగా ''వరుడు కావలెను'' సినిమా కూడా కొంచెం అటు ఇటుగా ఇదే పాయింట్ తో రాబోతోందని తెలుస్తోంది. ఇందులో యువ హీరో నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఇంతకముందు చెప్పుకున్న రెండు సినిమాల స్టోరీ లైన్స్ నే గుర్తు చేస్తుంది.

''వరుడు కావలెను'' సినిమా ఫన్ - ఎమోషన్స్ కలబోసిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చిత్ర బృందం చెబుతూ వస్తోంది. మన చుట్టు పక్కల కనిపించే వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నానని డైరెక్టర్ తెలిపారు. నేపథ్యం ఒకే విధంగా ఉన్నప్పటికీ అన్ని అంశాలను కొత్తగా చూపించామని.. ప్రతీ ఫ్రేమ్ లో కొత్తదనం కనిపిస్తుందని వెల్లడించారు. హీరో నాగశౌర్య సైతం సినిమా గురించి చెబుతూ.. పెళ్లి అనేది ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని.. సరికొత్తగా ప్రెజెంట్ చేశామని.. సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా ఉంటాయని అన్నారు.

సెకండాఫ్ లో 15 నిమిషాల ఒక ఎపిసోడ్ ఉంటుందని.. ట్రైలర్ లో దాన్ని ప్రస్తావించకుండా హైడ్ చేశామని నాగశౌర్య తెలిపారు. ఆ ఎపిసోడ్ లోనే కథకు సంబంధించిన మెయిన్ పాయింట్ ఉంటుందని.. మొత్తం సినిమా 15 మినిట్స్ మీద డిపెండ్ అయ్యుంటుందని.. హీరోయిన్ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుందనేది తెలియజేస్తుందని పేర్కొన్నారు. అయితే ఆ క్యూట్ మూమెంట్స్ ని థియేటర్లలో ఎంజాయ్ చేస్తే బాగుంటుందని దాయడం జరిగిందని యువ హీరో అన్నారు. పెళ్లి నేపథ్యంలో ఇటీవల వచ్చిన రెండు సినిమాల్ని జనాలు హిట్ చేశారు. మరి 'వరుడు కావలెను' సినిమాకు కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో చూడాలి.