Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తూ పెట్టిన పాత ట్వీట్లను తొలగించిన నాగబాబు..!
By: Tupaki Desk | 8 Oct 2021 6:42 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్ గా మారింది. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబరు 10న ఈ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొంటున్న రెండు ప్యానల్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారని ఇండస్ట్రీ జనాలే అనుకుంటున్నారు. ఈసారి 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే ఇరు వర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణలు.. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.
'మా' అధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్న మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు తో కలిసి ఇప్పటికే సినీ పెద్దల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేసారు. కృష్ణ - కృష్ణంరాజు - బాలకృష్ణ వంటి వారిని కలిశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లభించింది. మెగా బ్రదర్ నాగబాబు డైరెక్ట్ మీడియా ముఖంగా తన మద్దతు ప్రకటించారు. ఎలాగైనా మంచు విష్ణు కు చెక్ పెట్టాలని ప్రకాష్ రాజ్ తో ఉన్న విభేదాలను సైతం నాగబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజ్ ను నాగబాబు పలు సందర్భాల్లో విమర్శించారు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ఆయన్ని 'ఊసరవెల్లి' తో పోల్చిన సంగతి తెలిసిందే. అప్పుడు దీనికి నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు.
''మిస్టర్ ప్రకాష్ రాజ్.. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో.. డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు'' అని నాగబాబు గత నవంబర్ లో ట్విట్టర్ వేదికగా ఓ నోట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ రాజకీయ అభిప్రాయాలపై నాగబాబు కౌంటర్లు కూడా ఇచ్చారు.
కట్ చేస్తే.. ప్రస్తుతం జరుగుతున్న 'మా' ఎన్నికలలో ప్రకాష్ రాజ్ మరియు అతని ప్యానెల్ సభ్యులకు నాగబాబు తన మద్దతును ప్రకటించారు. చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేస్తున్నట్లు మెగా బ్రదర్ పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ కు ఓటు వేయాలని కోరుతూ.. మంచు విష్ణు ప్యానెల్ పై విమర్శలు గుప్పించారు. అయితే నాగబాబు గతంలో ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించడంతో.. వెంటనే వాటిని డిలీట్ చేశారు. కాకపోతే అప్పటికే ఆ పాత ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసిపెట్టుకున్న వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.
ఇదిలా వుండగా 'మా' ఎన్నికలు లోకల్ - నాన్ లోకల్ అంటూ ప్రాంతీయవాద రంగును పులుముకున్నాయి. ఈ మేరకు అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్ - మంచు విష్ణు ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రవిబాబు - రాజీవ్ కనకాల వంటి నటులు 'మా' సంస్థను నడుపుకోవడం మనకు చేతకాదా? దీని కోసం బయటి వ్యక్తులు కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. సీవీఎల్ నరసింహారావు వంటి వారు ప్రకాశ్ రాజ్ కి ఓటు వేయొద్దని ప్రకటించారు. మరోవైపు ఎన్నో ఏళ్ల క్రితం ప్రకాశ్ రాజ్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారని నాగబాబు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో జరగబోయే 'మా' ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికవుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.