Begin typing your search above and press return to search.

ఆరెంజ్ పీడకల గురించి నాగబాబు

By:  Tupaki Desk   |   2 May 2018 11:07 AM GMT
ఆరెంజ్ పీడకల గురించి నాగబాబు
X
మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడంటే జబర్దస్త్ జడ్జ్ గా ఇప్పటి తరానికి బాగా సుపరిచితుడు కాని ముప్పై ఏళ్ళ క్రితమే భారీ సినిమాల నిర్మాతగా మెగాస్టార్ తమ్ముడిగా సోలో హీరోగా పదికి పైగా సినిమాల్లో నటించాడన్న అవగాహన కొందరికే ఉంది. ఆరంజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళి నిర్మాతగా మారిన నాగబాబు నా పేరు సూర్య కోసం అల్లు ఫ్యామిలీ ప్రోత్సాహం ప్లస్ అన్నయ్య చిరు తమ్ముడు పవన్ సహకారంతోనే మళ్ళి నిర్మాణంలోకి వచ్చినట్టు చెబుతున్నాడు. మగధీర లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కు ఆరంజ్ తీసి డిజాస్టర్ ఇచ్చినందుకు చాలా బాధ పడ్డానని ఆర్థికంగా నష్టపోవడం కంటే అదే తనను ఎక్కువగా బాధించింది అన్న నాగబాబు ఫ్యామిలీ వల్లే తిరిగి కోలుకున్నానని చెప్పుకొచ్చారు. జబర్దస్త్ తనకో కొత్త లైఫ్ ఇచ్చిందన్న నాగబాబు ఇకపై కూడా సినిమా నిర్మాణం కొనసాగిస్తాను అని చెప్పడం విశేషం.

నాగబాబు నిర్మాతగా చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మూడు సినిమాలు నిర్మించారు. అవి త్రినేత్రుడు-రుద్రవీణ-ముగ్గురు మొనగాళ్ళు. మూడు ఆశించిన రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ కాలేదు. రుద్రవీణ మాత్రం అవార్డులు తీసుకొచ్చింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తీసిన బావగారు బాగున్నారా ఒకటే నిర్మాతగా నాగబాబు లాభాలు చూసేలా ఆడింది. ఇక దాని తర్వాత ఆరంజ్ కథ అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తాను సినిమాలు తీయకపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటాడు నాగబాబు. నా పేరు సూర్య విషయంలో కొందరు పనిగట్టుకుని విడుదలకు ముందే నెగటివ్ ప్రచారం చేస్తున్నారని అది గుర్తించే అల్లు అరవింద్ మొన్న అలా అన్నారు తప్ప మీడియాను వెలి వేయడానికి మేమైనా పెదరాయుళ్ళమా అంటూ రివర్స్ పంచ్ వేసాడు నాగబాబు. వరుణ్ హిట్స్ మీద ఉన్నాడు కదా అని తనతో సినిమాలు నిర్మించడం తనకు ఇష్టం లేదని బయటి నిర్మాతలకు అందుబాటులో ఉండటమే తనకు కావాల్సిందని చెప్పిన నాగబాబు నా పేరు సూర్య సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.