Begin typing your search above and press return to search.

పర్సనల్ ఫోన్ కి నాగబాబు రియాక్షన్ అలానా?

By:  Tupaki Desk   |   14 Jan 2017 11:10 AM IST
పర్సనల్ ఫోన్ కి నాగబాబు రియాక్షన్ అలానా?
X
వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి ఎవరైనా అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకున్నా.. అపార్థాలకు తావిచ్చినా ఏవరైనా ఏం చేస్తాం? అరే.. అలాంటి మనిషి కాడే? అలా మాట్లాడాడా? ఏ కారణంతో మాట్లాడాడో? అని అనుకోవటం కనిపిస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా మిగిలిన వారి మాదిరి చిలువలు వలువలుగా ఊహించేసుకొని.. ఏదేదో మనసులో అనుకోవటం లాంటివి చాలామంది చేయరని అనుకుంటారు. కానీ.. అలాంటిదేమీ ఉండదని.. బయట నలుగురు అనుకునే మాటల్ని నలభై రకాలుగా ఊహించుకునే అవకాశం ఉంటుందన్న నిజం దర్శకుడు క్రిష్ కు అర్థమై ఉంటుంది.

ఆ మధ్యన తిరుపతిలో నిర్వహించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకల సందర్భంగా దర్శకుడు క్రిష్ భావోద్వేగంతో మాట్లాడటం.. మధ్యలో ఖబడ్డార్ అనే మాటను ఆయన నోటి వెంట రావటంతో చాలామందికి ఒకలా అనిపించినా.. కొందరికి మాత్రం మరోలా అనిపించింది. చివరకు క్రిష్ నోటి నుంచి వచ్చిన ఖబడ్డార్ అనే మాట.. చిరంజీవిని ఉద్దేశించి అన్నదన్న ప్రచారం జరిగిపోయింది.

తన పని ఏమిటో తాను చేసుకుపోవటం.. స్నేహంగా ఉండటం.. తొందరపడి ఒక మాట అనేందుకు పెద్దగా ఇష్టపడని క్రిష్ లాంటి ఫ్రెండ్లీ వ్యక్తి నోటి నుంచి ఖబడ్డార్ అనే మాటకు అర్థం ఏమిటన్నది పక్కన పెట్టేసి.. జరిగిన ప్రచారం ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఆయన సతీమణి గుర్తించారు. వెనువెంటనే క్రిష్ ను ఆమె అలెర్ట్ చేశారు. తాను అన్నది తెలుగువాడి పౌరుషం గురించి కదా? కొందరికి మరోలా అర్థమైందా? అని ఫీలై.. వెంటనే దర్శకుడు వినాయక్ కు ఆయన ఫోన్ చేస్తే.. ఆయన లైట్ తీస్కో అంటూ తేల్చేశారట.

తర్వాత చిరుకి ఫోన్ చేస్తే.. ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదట. కానీ.. నాగబాబుకు ఫోన్ చేస్తే మాత్రం.. ‘అదేంటి క్రిష్ అలా అన్నావని వార్తలు వస్తున్నాయి’ అని అన్నారట. దీంతో నాగబాబుకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందట. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి అనుకోని రీతిలో వివాదంలోకి జారితే.. లైట్ తీసుకోమని చెప్పాల్సింది పోయి.. వివరణ ఇచ్చుకునే వరకూ నాగబాబు వెళ్లారన్న మాట విన్న వారంతా ఆశ్చర్యపోవటమే కాదు.. ఈ మెగా తమ్ముడు ఇలా చేస్తున్నారేమిటన్న మాట పలువురి నోటి వినిపిస్తోంది. మరి.. ఇలాంటివి కూడా నాగబాబు వింటే బాగుంటుందేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/