Begin typing your search above and press return to search.

'మా' ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా!

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:47 AM GMT
మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా!
X
'మా' అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలలో మొదటి నుంచి కూడా నాగబాబు చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. మెగా ఫ్యామిలీ మద్దతు ఎవరికీ అనే విషయంలో ఒక స్పష్టత ఇస్తూ, వారిని గెలిపించడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేసేవారు. 'మా' ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ, తన నిర్ణయాలను .. అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే ఆయన ఈ సారి ప్రకాశ్ రాజ్ ప్యానల్ కి తమ మద్దతు ప్రకటిస్తూ ముందుకు వచ్చారు.

అయితే సాయితేజ్ విషయంపై పూర్తి ఫోకస్ పెట్టడం వలన ఈ సారి తాను ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టలేదని రీసెంట్ఒ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయనే అన్నారు. అయితే ప్రకాశ్ రాజ్ కి తమ మద్దతు ఉంటుందనీ .. ఈ సారి ఆయనకి అవకాశం ఇద్దామని మోహన్ బాబుతో అన్నయ్య మాట్లాడటం జరిగిందనీ, అయినా కూడా లోకల్ .. నాన్ లోకల్ అనే విషయాన్ని తెరపైకి తెచ్చి విష్ణు తన ప్యాన్ ల ను ఏర్పాటు చేసుకున్నాడని అన్నారు. అన్నయ్య చేసిన సూచనలను విష్ణు వాళ్లు పట్టించుకోకపోవడం బాధాకరమని చెప్పారు.

ప్రకాశ్ రాజ్ ఒక మంచి ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఆయన గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నాడు అనే ఒక స్పష్టతను తీసుకున్న తరువాతనే ఆయనకి మద్దతును ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఈ సారికి ప్రకాశ్ రాజ్ ని చేయనిద్దాం .. 'మా' విషయంలో ఆయన ప్రణాళిక చాలా బాగుందని చెబితే ఎవరూ వినిపించుకోలేదు. అన్నయ్య ద్వారా అనేక విధాలుగా లబ్ది పొందినవారు కూడా ఈ మాటలను వినిపించుకోలేదు. ఇక ప్రకాశ్ రాజ్ ఎటువైపు .. పవన్ కల్యాణ్ వైపా? 'మా' వైపా? అంటూ విష్ణు చేసిన కామెంట్లు అసహనాన్ని కలిగించాయని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక నిన్న రాత్రి 'మా' ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ అపజయాన్ని పొందడంతో, నాగబాబు వెంటనే ఒక నిర్ణయం తీసేసుకున్నారు. "ప్రాంతీయవాదం .. సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'లో కొనసాగడం నాకు ఇష్టం లేక, 'మా అసోసియేషన్'లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను .. సెలవు" అంటూ ఆయన బాంబు పేల్చారు. మెగా ఫ్యామిలీ మాటకు విలువ .. గౌరవం లేని చోటున తాను ఉండలేననే భావన, జరిగిన పరిణామాలపై గల అసంతృప్తి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెప్పుకుంటున్నారు. ఇక ఈ విషయంపై ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి.