Begin typing your search above and press return to search.

పవన్ పై ఏపీ సర్కారు కక్షగట్టింది..!

By:  Tupaki Desk   |   26 Feb 2022 7:53 PM GMT
పవన్ పై ఏపీ సర్కారు కక్షగట్టింది..!
X
భీమ్లా నాయక్' సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ముందుగానే థియేటర్ యాజమాన్యాలక ఆదేశించిన రెవెన్యూ అధికారులు.. జీవో నెం. 35 ప్రకారమే టికెట్ ధరలను వర్తింప చేయాలని నోటీసులు జారీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించి రేట్లు పెంచి టికెట్లు విక్రయించినా, అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి గతేడాది ఏప్రిల్ నుంచి ఉన్న నిబంధనలే అయినప్పటికీ.. ఇటీవల కొన్ని చిత్రాల విషయంలో ప్రభుత్వం ఈ విధంగా నోటీసులు జారీ చేయలేదు. దీంతో 'భీమ్లా నాయక్' చిత్రాన్ని అడ్డుకోడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోందంటూ అభిమానులు ఆరోపణలు చేశారు.

ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్దేశించిన జీవోను తాత్కాలికంగా నిలిపి, జాయింట్ కలెక్టర్ల దగ్గర అనుమతి తీసుకోమని హైకోర్టు తీర్పు చెప్పిందని.. దానికి అనుగుణంగానే అందరూ వ్యవహరించాలని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై పవన్ సోదరుడు, నటుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ పై ఏపీ సర్కారు కక్షగట్టిందని.. వకీల్ సాబ్ నుంచి భీమ్లా నాయక్ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ ను, పవన్ ను టార్గెట్ చేసిందనే విషయం అర్థమవుతుందని నాగబాబు అన్నారు. సినిమా టికెట్ ధరల పై ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదని.. జీవో విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని మెగా బ్రదర్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం బాధాకరమని నాగబాబు పేర్కొన్నారు. సినిమా పెద్దలు పవన్ కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది తప్పు అని చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదని.. అగ్ర హీరోల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నాగబాబు ప్రశ్నించారు.

''సినీ పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా సహకరిస్తాం. హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటాం. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రజలేమీ శాశ్వత అధికారం ఇవ్వలేదన్న విషయాన్ని వైసీపీ గ్రహించాలి. వారు అధికారంలో ఉండేది ఐదేళ్లేనని గుర్తుంచుకోవాలి'' అని నాగబాబు చెప్పుకొచ్చారు.