Begin typing your search above and press return to search.

‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్’ జాబితాలో నాగచైతన్య..!

By:  Tupaki Desk   |   2 Jun 2021 10:30 AM GMT
‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్’ జాబితాలో నాగచైతన్య..!
X
అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువసామ్రాట్ నాగచైతన్య.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బాగా కష్టపడుతున్నాడు. సినిమా సినిమాకు నటనలో పరిణితి కనబరుస్తున్న చైతన్య.. ఆఫ్ స్క్రీన్ లో మంచి మనసున్న వ్యకిగా ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. అందుకే అక్కినేని యువ హీరోకి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా 'మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్ 2020' జాబితాలో చోటు సంపాదించుకున్నాడు చైతూ.

ప్రముఖ మ్యాగజైన్‌ 'హైదరాబాద్‌ టైమ్స్‌' ప్రతి ఏడాదిలాగానే, 2020 సంవత్సరానికి గాను 30 మందితో కూడిన 'మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌' జాబితాను తాజాగా విడుదల చేసింది. సోషల్ మీడియా ఫాలోయింగ్.. ఆన్‌ లైన్ ఓటింగ్‌ ప్రక్రియలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందిస్తారని తెలుస్తోంది. ఇందులో అక్కినేని నాగచైతన్య 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది 11వ స్థానంలో ఉన్న చైతన్య ఈ ఏడాది 6వ స్థానానికి రావడం అతని క్రేజ్ ని తెలియజేస్తోంది. ఇందులో చైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని 20వ స్థానంలో ఉన్నాడు.

ఇక సినిమాల విషయానికొస్తే 'మజిలీ' 'వెంకీమామ' వంటి వరుస హిట్స్ అందుకున్న చైతూ.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్నారు. అలానే విక్రమ్ కె కుమార్ తో కలిసి 'థాంక్యూ' సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో నాగచైతన్య పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.

కాగా, 'హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ 2019' జాబితా ప్రకారం విజయ్ దేవరకొండ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ త‌ర్వాతి స్థానాల‌లో రామ్ పోతినేని(2) - ఎన్టీఆర్(3) - రామ్ చ‌ర‌ణ్‌(4) - నాగ శౌర్య‌(5) ఉన్నారు. అలానే సందీప్ కిషన్(9) - న‌వదీప్(10) - రానా దగ్గుబాటి(11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అల్లు అర్జున్‌ కి ఈ జాబితాలో 16వ స్థానం ద‌క్క‌డం గమనార్హం. ఇక 'ఫరెవర్ మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌' జాబితాలో కొత్తగా ప్రభాస్ చేరారు. ఇంతకుముందు చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - మహేష్ బాబు లను హైదరాబాద్‌ టైమ్స్‌ 'మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌-ఫరెవర్' గా గుర్తించింది.