Begin typing your search above and press return to search.

నేనే హీరో అంటున్న నాగ్

By:  Tupaki Desk   |   18 Feb 2017 12:51 PM IST
నేనే హీరో అంటున్న నాగ్
X
దర్శకుల బ్యాగ్రౌండ్ చూడకుండా అవకాశాలిచ్చే హీరో అక్కినేని నాగార్జున. ‘శివ’ దగ్గర్నుంచి ‘సోగ్గాడే చిన్నినాయనా’ వరకు ఎంతోమంది కొత్త దర్శకులు.. చిన్న స్థాయి డైరెక్టర్లతో పని చేసి ఆశ్చర్యపరిచాడు నాగ్. తాజాగా యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది-2’కు ఓకే చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు అక్కినేని హీరో. ఐతే ‘రాజు గారి గది’ తరహాలోనే ఇందులోనూ తారాగణం పెద్ద స్థాయిలో ఉంటుందని.. అందులో నాగార్జున ఒక పాత్రధారి మాత్రమే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తాయి. ఆయనది ఎక్స్టెండెడ్ క్యామియో అన్న రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై నాగార్జున స్వయంగా స్పందించాడు. ఆ ప్రచారం అబద్ధం అన్నాడు.

‘‘రాజు గారి గది-2 కోసం బాగానే సన్నద్ధమయ్యాను. శనివారం నుంచే సెట్లో అడుగుపెడుతున్నా. ఎదుటివారి మానసిక పరిస్థితుల్ని అంచనా వేసే మనో విశ్లేషకుడి పాత్ర పోషిస్తున్నా. ఇదో కొత్త పాత్ర. ఇంతవరకు ఇలాంటి పాత్రను నేను చేయలేదు. నా గెటప్ అదీ కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో నాది అతిథి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ఇందులో నేనే హీరో. వరుసగా కొత్త రకమైన కథల్ని ఎంచుకుని ప్రయాణం సాగిస్తున్న సమయంలో ‘రాజు గారి గది-2’ లాంటి సినిమాలో నేను భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ప్రస్తుతానికి ఇది తప్ప వేరే సినిమాలేవీ కమిటవ్వలేదు’’ అని నాగార్జున తెలిపాడు. ఓవైపు ‘రాజు గారి గది-2’ చేస్తూనే తన ప్రొడక్షన్లో రానున్న అఖిల్.. నాగచైతన్యల సినిమాల్ని పర్యవేక్షిస్తున్నానని.. చైతూ-కళ్యాణ్ కృష్ణల సినిమా మే లేదా జూన్లో మొదలవుతుందని.. అఖిల్ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తామని నాగ్ వెల్లడించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/