Begin typing your search above and press return to search.

నాగ్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు

By:  Tupaki Desk   |   28 Nov 2018 1:30 AM GMT
నాగ్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు
X
తెలుగులో కొత్త వాళ్లకు.. అప్ కమింగ్ టాలెంట్ కు అవకాశాలివ్వడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. రామ్ గోపాల్ వర్మతో మొదలుకుని ఎంతోమంది డెబ్యూ.. అప్ కమింగ్ డైరెక్టర్లకు ఛాన్సులిచ్చాడు నాగ్. ఐతే ఈ మంచి గుణంతో పాటు నాగార్జునకు ఓ చెడ్డ అలవాటు కూడా ఉంది. తాను అవకాశం ఇచ్చిన వాళ్లు సరిగా ఉపయోగించుకోకుంటే.. తనను నిరాశ పరిస్తే వాళ్ల గురించి చాలా నెగెటివ్ గా మాట్లాడేస్తాడు. వాళ్ల కెరీర్లను దెబ్బ తీసేలాగా కామెంట్లు చేస్తాడు. నాగార్జునతో ‘భాయ్’ సినిమా చేసిన వీరభద్రం చౌదరి విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా కథ నచ్చి తన సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేశాడు నాగ్. భారీ బడ్జెట్ పెట్టి భరోసాతో సినిమాను నిర్మించాడు. విడుదలకు ముందు కూడా దీని గురించి గొప్పగానే చెప్పాడు. కానీ తర్వాత నాగ్ మాట మారిపోయింది.

‘భాయ్’ సినిమాను చాలా తక్కువ చేసి మాట్లాడాడు. తన మీద గౌరవం ఉన్న వాళ్లు ఆ సినిమా చూడకపోవడమే మంచిదన్నాడు. ఆ తర్వాత వేర్వేరు సందర్భాల్లో ‘భాయ్’ గురించి దారుణమైన కామెంట్లు చేశాడు. సినీ రంగంలో ఫెయిల్యూర్లన్నవి సహజం. తప్పులు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద దర్శకులే దారుణమైన సినిమాలు చేస్తుంటారు. అంత మాత్రాన దర్శకుడిని ఒక్కడినే బాధ్యుడిని చేసి నెగెటివ్ కామెంట్లు చేయడం సమంజసం కాదు. కానీ వీరభద్రం విషయంలో అలాంటి కామెంట్లే చేసి అతడి కెరీర్ ను దెబ్బ తీశాడు. ‘భాయ్’ తర్వాత అతడికి చిన్న స్థాయి సినిమా దక్కించుకోవడం కష్టమైంది. అతి కష్టం మీద ‘చుట్టాలబ్బాయి’ చేశాడు. అది ఆడలేదు. ఆ తర్వాత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఫలించలేదు. చివరికి ఇప్పటి దాకా హిట్టు ముఖం చూడని బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ట్రై చేస్తే అతను ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించాడు. శ్రీనివాస్ తో తన సినిమా ఓకే అయిందని వీరభద్రం బయట చెప్పుకోగా దాని గురించి వార్తలు వచ్చాయి. వెంటనే శ్రీనివాస్ టీం లైన్లో కొచ్చి ఆ వార్తల్ని ఖండించింది. చివరికి సక్సెస్ రుచి చూడని శ్రీనివాస్ సైతం తాను వీరభద్రంతో సినిమా చేయట్లేదని హడావుడిగా ఖండించాడంటే ఈ దర్శకుడి పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. తన పాటికి తాను ‘అహనా పెళ్లంట’.. ‘పూల రంగడు’ లాంటి చిన్న స్థాయి సినిమాలు చేసుకున్నంత వరకు వీరభద్రం కెరీర్ బాగానే ఉంది. నాగార్జునతో ‘భాయ్’ చేశాకే కథ అడ్డం తిరిగింది.