Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మెచ్చిన మన్మథుడు .. నాగార్జున

By:  Tupaki Desk   |   29 Aug 2021 3:46 AM GMT
టాలీవుడ్ మెచ్చిన మన్మథుడు .. నాగార్జున
X
నాగార్జున .. తెలుగు తెరపై ఒక రొమాంటిక్ హీరో. నిన్నటితరం అమ్మాయిల తలపుల్లో గ్రీకువీరుడు. మగువల మనసులు దోచిన మన్మథుడు. తెలుగు తెరకు నాగార్జున 'విక్రమ్' సినిమాతో పరిచయమయ్యారు. సినిమా సూపర్ హిట్ .. కాకపోతే నాగార్జున నటనలో కాస్త మెళకువలు నేర్చుకుంటే బాగుంటుందని అన్నారు. ఆ తరువాత ఆయన 'మజ్ను' సినిమా చేశాడు. ఈ సినిమాలో చూసినవారు కూడా అదే మాట అన్నారు. ఇక విమర్శలను తిప్పికొట్టడానికి సిద్ధపడిన నాగార్జున 'కిరాయి దాదా'లో కాస్త దూకుడు చూపించారు.

ఫరవాలేదు కుర్రాడు దార్లో పడుతున్నాడు అని అంతా అనుకున్నారు. వాళ్లు అనుకున్నట్టుగానే నాగార్జున తనవైపు నుంచి కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ముందుకువెళ్లడం మొదలుపెట్టారు. తనలోని నటుడిని .. ఆ నటుడిలోని విభిన్నమైన కోణాలను ఆవిష్కరించాలని అనుకున్న నాగార్జున, మణిరత్నం దర్శకత్వంలో 'గీతాంజలి' .. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'శివ' సినిమా చేశారు. ఈ రెండు సినిమాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాగార్జున కెరియర్ అనే కాయిన్ కి బొమ్మా బొరుసులా ఈ రెండు సినిమాలు కనిస్తాయి.

అప్పట్లో ఏఎన్నార్ గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడుగా చేసిన అన్ని సినిమాలు హిట్టు మీద హిట్టు కొడుతూ వెళ్లాయి. అలా పంచెగట్టి .. ముల్లుగర్ర చేతబట్టి మాస్ ఆడియన్స్ కి చేరువ కావాలని అనుకున్న నాగార్జున, 'జానకి రాముడు' .. 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఆయనకి భారీ విజయాలను అందించాయి. ఇక 'హలో బ్రదర్'లో ద్విపాత్రాభినయం చేసిన ఆయన, ఆ పాత్రల్లోని వేరియేషన్స్ ను గొప్పగా చూపించారు.

సినిమాకి సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళ్లిన నాగార్జున, 'సంతోషం' .. 'మన్మథుడు' సినిమాలతో తన క్రేజ్ ను పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాల్లో ఆయనలోని రొమాంటిక్ హీరో విజృంభించాడు. రొమాంటిక్ హీరో అనిపించుకున్న ఆయన ఒక్కసారిగా భక్తి సినిమాలు చేయడానికి అంగీకరించడం ఆయన సాహసానికి నిలువెత్తు నిదర్శనం. 'అన్నమయ్య' '.. 'శ్రీరామదాసు' సాధించిన విజయాలు ఆయన నటనా పటిమకు నిర్వచనం. నాగార్జునలోని నటుడు సాధించినా పరిణతికి ఈ రెండు సినిమాలు కొలమానంగా నిలిచాయి.

వర్మ .. కృష్ణవంశీ .. ఈవీవీ .. రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి నాగార్జున కెరియర్ ను ప్రభావితం చేయడంలో కీలకమైన పాత్రను పోషించారు. ఇలా నాగార్జున తన కెరియర్లో అనేక మలుపులు తీసుకుంటూ ముందుకు వెళ్లారు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల వేగాన్ని అందుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కొత్త దర్శకులను .. కొత్త హీరోయిన్లను ఎంతోమందిని పరిచయం చేశారు. తాను నమ్మిన కథ కోసం నిర్మాతగాను ప్రయోగాలు చేశారు. వరుస పరాజయాలు కుదిపేసినా ఆయన డీలాపడిపోలేదు. మరింత ఉత్సాహంతో ఆయన తన పరుగును కొనసాగించారు. తండ్రితోనే కాదు .. తనయులతోను పోటీపడి నటిస్తుండటం విశేషం. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.