Begin typing your search above and press return to search.

ఏపీలో టికెట్ రేట్లతో నా సినిమాకు ఇబ్బందేం లేదు: నాగార్జున

By:  Tupaki Desk   |   5 Jan 2022 3:44 PM GMT
ఏపీలో టికెట్ రేట్లతో నా సినిమాకు ఇబ్బందేం లేదు: నాగార్జున
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకి మధ్య ఎన్ని చర్చలు జరిగినా ఈ వ్యవహారం మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ప్రజలకు తక్కువ ధరలకే సినీ వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టికెట్ ధరలు నియంత్రించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతామని సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా టిక్కెట్ రేట్ల అంశం మీద చిరంజీవి - సురేష్ బాబు - రాఘవేంద్రరావు - డీవీవీ దానయ్య - సి. కళ్యాణ్ - నాని - సిద్దార్థ్ వంటి హీరోలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సర్కారు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీ సమస్యల గురించి ఏనాడూ మాట్లాడని రామ్ గోపాల్ వర్మ సైతం ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ పాత్రను ప్రశ్నించారు. అయితే తాజాగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ ఇష్యూపై భిన్నంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన ''బంగార్రాజు'' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జనవరి 14న సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 'టికెట్ రేట్ల అంశంపై పలువురు తమ ఒపీనియన్ చెప్తున్నారు.. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి?' అని విలేఖరులు ప్రశ్నించగా.. ''సినిమా స్టేజీ మీద రాజకీయ విషయాల గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను'' అని నాగార్జున బదులిచ్చారు.

అలానే ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్‌ ధరల్లో తేడా ఉండటం వల్ల మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కదా? అని ప్రశ్నించగా.. ''నాకు ఇబ్బందేమీ లేదు. టికెట్‌ రేట్లు ఎక్కువగా ఉంటే.. మాకు కొంచెం ఎక్కువ డబ్బులొస్తాయి. అయినా ఇబ్బంది లేదు. నా సినిమా వరకు ఇబ్బంది లేదు'' అని నాగ్ అన్నారు. 'బంగార్రాజు' డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదల చేసేందుకు అన్ని చోట్లా వంద శాతం కెపాసిటీ ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా అని ఈ సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేం. అందుకే వసూళ్లు తక్కువగా ఉంటాయని తెలిసినా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం అని నాగార్జున చెప్పుకొచ్చారు.

అయితే టికెట్ రేట్ల ఇష్యూపై నాగార్జున స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన సమస్యపై సినీ వేదిక మీద మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తన సినిమాకు ఇబ్బందేమీ లేదు అని చెప్పడాన్ని బట్టి.. పెద్ద సినిమాలు ఏమై పోయినా తనకు సంబంధం లేదనే విధంగా నాగ్ వ్యవహరిస్తున్నారని అనుకోవాలేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

'ఆర్.ఆ.ర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పెద్ద చిత్రాలు వాయిదా పడినందుకు బాధగా ఉందని చెప్పిన నాగార్జునకు.. తక్కువ టికెట్ రేట్లతో అలాంటి సినిమాలను విడుదల చేస్తే నష్టాలు తప్పవని తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ లో నాగ్ తో పాటుగా తనయులు నాగచైతన్య - అఖిల్ పెద్ద సినిమాలు చేస్తే అప్పుడు కూడా ఇలానే వ్యవహరిస్తారా అని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో ఒకరిగా ఉన్న నాగార్జున.. ఇండస్ట్రీ సమస్యపై స్పందించి ఉంటే బాగుందేదని అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు 'సినిమా స్టేజి మీద రాజకీయాల గురించి మాట్లాడకూడదు' అని నాగ్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ - నాని లను ఉద్దేశించినవే అని నెటిజన్స్ అంటున్నారు. గతంలో పవన్ - నాని లు ఏపీ ప్రభుత్వ విధివిధానాలపై సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే.