Begin typing your search above and press return to search.

'హలో బ్రదర్'లో నాగ్ కి డూప్ గా చేసింది ఈ స్టార్ హీరోనే!

By:  Tupaki Desk   |   19 April 2022 12:30 AM GMT
హలో బ్రదర్లో నాగ్ కి డూప్ గా చేసింది ఈ స్టార్ హీరోనే!
X
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'హలో బ్రదర్' ఒకటిగా కనిపిస్తుంది. నాగార్జున ఫస్టు టైమ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. అలాగే నాగార్జునను మాస్ ఆడియన్స్ కి మరింత చేరువ చేసిన సినిమా ఇది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు. 1994లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. ఈవీవీ కథాకథనాలు .. పాత్రలను మలచిన తీరు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సెంటిమెంట్ .. రొమాన్స్ .. కామెడీ .. ఇలా అన్ని అంశాలను ఈవీవీ సమపాళ్లలో రంగరించి అందించిన కథ ఇది. ముఖ్యంగా నాగార్జున పోషించిన రెండు పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు అద్భుతం. రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని ఆయన ఒక రేంజ్ లో ఆవిష్కరించారు. ఈ కథలో అన్ని రసాలను తగినట్టుగా సర్దుతూ వెళ్లడం వలన, చివరివరకూ కథనంలో పట్టు తగ్గకుండా నడిపించడం వలన ఎక్కడా బోర్ కొట్టదు. ఇప్పటికీ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడానికి కారణం ఈవీవీ గొప్పతనమే.

ఇక నాగ్ సరసన రమ్యకృష్ణ .. మరో నాగ్ జోడీగా సౌందర్య సందడి చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ సినిమాలో నాగార్జునలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించవలసి వచ్చినప్పుడు, నాగార్జునకి మరో హీరో డూప్ గా చేశాడు. నాగార్జున చెప్పేవరకూ ఈ విషయం బయటి ప్రేక్షకులలో ఎవరికీ తెలియదు. ఇంతకీ నాగార్జునకి డూప్ గా చేసిన ఆ హీరో ఎవరో కాదు .. శ్రీకాంత్. ఆయనకి ఈవీవీతో మంచి సాన్నిహిత్యం ఉంది. నాగార్జున హైటుకి .. పర్సనాలిటీకి దగ్గరగా శ్రీకాంత్ ఉండటంతో ఆయనకి ఈవీవీ ఈ ఛాన్స్ ఇచ్చారట.

ఆ మధ్య ఒక సందర్భంలో నాగ్ ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత కూడా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసినప్పటికీ, ' హలో బ్రదర్' స్థాయిలో ఏదీ అలరించలేకపోయింది .. ఆకట్టుకోలేకపోయింది. నాగ్ డ్యూయెల్ రోల్ మూవీ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఈ సినిమానే. అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఆ తరువాత కూడా శ్రీకాంత్ అటు నాగార్జున .. ఇటు ఈవీవీ సినిమాలలోను నటించాడు. ఇక ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోవడానికి మరో కారణం రాజ్ - కోటి అందించిన బాణీలని చెప్పుకోవచ్చు.