Begin typing your search above and press return to search.

నాగ్ లైవ్ పెర్‌ ఫార్మెన్స్‌!

By:  Tupaki Desk   |   23 Dec 2015 10:00 AM IST
నాగ్ లైవ్ పెర్‌ ఫార్మెన్స్‌!
X
కుర్ర‌హీరోలు ఆడియో వేడుక‌ల్లో రెచ్చిపోతుంటారు. లైవ్‌ లో డ్యాన్స్ పెర్‌ ఫార్మెన్సులు ఇచ్చేస్తూ అభిమానుల్ని అల‌రిస్తుంటారు. ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మొద‌లుకొని మొన్న‌టి సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌ర‌కు ప‌లువురు క‌థానాయ‌కులు స్టేజీపైన అదర‌గొట్టిన‌వాళ్లే. ఇక బాల‌కృష్ణ‌ - వెంక‌టేష్‌ - ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ లాంటి క‌థానాయ‌కులైతే అభిమానుల కోరిక మేర‌కు స్టేజీపై డైలాగులు చెప్పి ఉర్రూత‌లూగిస్తుంటారు. లైవ్ ఫెర్‌ ఫార్మెన్సుల‌కి మాత్రం సీనియ‌ర్లు దూరంగానే ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం ఒక అడుగు ముందుకేశాడు. కుర్రాళ్ల‌కి ధీటుగా లైఫ్ పెర్‌ ఫార్మెన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. `సోగ్గాడే చిన్ని నాయ‌నా` ఆడియో వేడుక ఆ అరుదైన ఘ‌ట్టానికి వేదిక కాబోతుండ‌డం విశేషం.

నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన సోగ్గాడే చిన్ని నాయనాకు వైవిధ్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆడియో వేడుక‌ని కూడా విభిన్నంగా జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కొద్ది రోజుల్లో జరగబోయే అడియో ఫంక్షన్ లో లైవ్ ట్రయిలర్ షో కార్యక్రమం రూపొందించారు. ఇలాంటి కార్యక్రమాన్ని తెలుగులో ప్లాన్ చేయడం బహుశా ఇదే తొలిసారేమో. లైవ్ ట్రయిలర్ అంటే.. ట్రయిలర్ కట్ చేసిన తరువాత అది ఎలా వుంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా స్టేజ్ మీద అదే నటులు పెర్ఫార్మ్ చేయ‌డం అన్న‌మాట‌. సంభాషణలైతే సంభాషణలు, పాటలైతే పాటలు, ఇలా ప్రతి ఒక్కటి ట్రయిలర్ లో వున్నట్లు, అదే నటీనటులు స్టేజ్ మీదకు వచ్చి ప్రదర్శిస్తారన్న‌మాట‌. ఇదేదో బాగుంది క‌దా! మ‌రి నాగ్ లైవ్ షోలో ఎలా సంద‌డి చేస్తాడో చూడాలి. క‌ళ్యాణ్ కృష్ణ అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.