Begin typing your search above and press return to search.

నాగ్ స్ట్రాటజీయే వేరబ్బా

By:  Tupaki Desk   |   3 Jan 2018 3:08 PM GMT
నాగ్ స్ట్రాటజీయే వేరబ్బా
X
రెండేళ్ల కిందట సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ - నందమూరి బాలకృష్ణ - శర్వానంద్ సినిమాలు బరిలో ఉన్నా.. వాటిపై మంచి అంచనాలున్నా నాగార్జున తగ్గలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో సంక్రాంతి రేసులో అందరి కంటే లేటుగా దిగాడు. అందరినీ మించిపోయి భారీ విజయం అందుకున్నాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ ఆయన నుంచి ఓ సినిమా సంక్రాంతికి రాబోతోంది. అదే.. రంగుల రాట్నం. రాజ్ తరుణ్-చిత్ర శుక్లా జంటగా శ్రీ రంజని అనే కొత్త దర్శకురాలు రూపొందించిన సినిమా ఇది. తాను ప్రొడ్యూస్ చేసిన ‘ఉయ్యాల జంపాల’ తరహాలోనే ఇది కూడా మంచి విజయం సాధిస్తుందని నాగ్ ధీమాగా ఉన్నాడు. ‘అజ్ఞాతవాసి’తో పాటు ‘జై సింహా’.. ‘గ్యాంగ్’ సినిమాలకు పోటీగా ఈ చిన్న సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు.

విడుదలకు పది రోజుల ముందు వరకు అసలు ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషాన్నీ బయటపెట్టుకుండా ఒకేసారి రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్ మొదలుపెట్టడం అన్నది నాగార్జునకే చెల్లింది. ఆయన ఎంచుకున్న రిలీజ్ డేట్ కూడా ఆశ్చర్యపరిచేదే. ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేస్తారట. ఆ రోజు ఆదివారం కావడం విశేషం. మామూలుగా శుక్రవారమే సినిమాలు రిలీజవుతాయి. కొన్ని సినిమాల్ని ఇంకా ముందే.. అంటే గురువారమో బుధవారమో రిలీజ్ చేస్తుంటారు. ‘అజ్ఞాతవాసి’ బుధవారమే వస్తోంది. ఐతే ఆదివారం కొత్త సినిమా రిలీజ్ చేయడం మాత్రం అరుదే. ఐతే ముందు పెద్ద సినిమాల హడావుడి కొంచెం తగ్గితే చాలని.. సోమవారం సంక్రాంతి పండగ.. ఇంకా ఒకట్రెండు రోజులు సెలవుంటాయి.. తర్వాతి వారంలో కొత్త సినిమాల రిలీజ్ కూడా ఉండదు కాబట్టి.. అన్నీ చూసుకుని ఆదివారమే తమ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యాడు నాగ్. తక్కువ బడ్జెట్లో సినిమా తెరకెక్కడం వల్ల పెట్టుబడి రికవరీ పెద్ద కష్టం కాదన్నది ఆయన ఆలోచన. మరి ఆయన స్ట్రాటజీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.