Begin typing your search above and press return to search.

నాగార్జున ఎందుకు చిరుకు ఇచ్చేశాడంటే..

By:  Tupaki Desk   |   2 Feb 2017 10:47 AM GMT
నాగార్జున ఎందుకు చిరుకు ఇచ్చేశాడంటే..
X
గత మూడు దశాబ్దాల్లో తనకు సినిమాల ద్వారా ఎంత పేరొచ్చిందో.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా అంత పేరొచ్చిందని ఆ మధ్య వ్యాఖ్యానించాడు అక్కినేని నాగార్జున. ఆయన మాటలు వినడానికి కొంచెం అతిశయోక్తిలా ఉండొచ్చు కానీ.. ఆ షో ద్వారా నాగార్జున టీవీ ప్రేక్షకుల్లోకి కూడా చొచ్చుకుపోయాడన్నది వాస్తవం. మామూలుగా టీవీ చూడని జనాలు సైతం ఈ షో చూశారు. అందులో నాగార్జున పాత్రా ఉంది. ప్రోగ్రాం గొప్పదనమూ ఉంది. మూడు సీజన్ల పాటు ఎంఈకే షోతో అలరించాడు నాగ్. కానీ గత ఏడాది ఉన్నట్లుండి నాగ్ ఈ షోకు దూరమయ్యాడు. నాలుగో సీజన్ బాధ్యతలు చిరు తీసుకున్నాడు. ఐతే మాటీవీ వాళ్లే నాగార్జునకు టాటా చెప్పేశారా.. లేక నాగార్జునే తప్పుకున్నాడా అన్న సందిగ్ధత జనాల్లో ఉంది.

ఈ సందిగ్ధతకు నాగ్ తెరదించాడు. తానే ఈ షో నుంచి తప్పుకున్నానన్నాడు. జనాలకు మూడు సీజన్ల పాటు తనను చూశాక మొనాటనీ వచ్చేస్తోందని భావించే తాను తప్పుకున్నానన్నాడు. తాను కూడా ఆ షో చేసి చేసి అలసిపోయానన్నాడు నాగ్. ‘‘జనాలు ముందే నా రియాక్షన్ ఏంటన్నది గెస్ చేసేస్తున్నారు. 180 ఎపిసోడ్లుగా నన్ను చూస్తుండటంతో నా హావభావాలపై వాళ్లకు బాగా అవగాహన వచ్చేసింది. ఇలా అయితే షో చూడటంలో ఉండే ఉత్సాహం చచ్చిపోతుంది. దీనికి తోడు ఉదయం 9 నుంచి సాయంత్రం 6-7 వరకు పూర్తిగా ఏకాగ్రత మొత్తం పెట్టడం చాలా చాలా కష్టం. ఒక నిమిషం ఏకాగ్రత తప్పినా.. షోలో పాల్గొనే వాళ్లతో నా సంభాషణ దెబ్బ తింటుంది. వాళ్లతో సంభాషణ నాకెంతో ఇష్టమే కానీ.. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు దృష్టి కేంద్రీకరించడం కష్టం. అలసిపోయినట్లు అనిపించేది. అందుకే ఎంఈకే మూడో సీజన్ చివరి రోజు నేను ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించా. కనీసం ఒకట్రెండు సీజన్లయినా బ్రేక్ తీసుకోవాలనిపించింది’’ అని నాగ్ తెలిపాడు. చిరు ఒకట్రెండు సీజన్లు ఈ కార్యక్రమాన్ని నడిపించాక నాగ్ పునరాగమనం చేసేలాగే ఉన్నాడు ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/