Begin typing your search above and press return to search.

మన్మథుడు 2 హీటు చిన్మయికి తగిలిందే!

By:  Tupaki Desk   |   14 Jun 2019 9:27 AM GMT
మన్మథుడు 2  హీటు చిన్మయికి తగిలిందే!
X
'తనవరకూ వస్తేకానీ తత్త్వం బోధపడదు' అని తెలుగులో ఒక సామెత ఉంది. కొంచెం నాటుగా అయితే 'మనదాకా వస్తే కానీ నొప్పి తెలియదు' అంటారు. ఇతరులను విమర్శించడం చాలా సులువు. ముందు వెనకా చూడకుండా విమర్శించవచ్చు. అయితే మనకు అదే పరిస్థితి ఎదురైతే? '1 నేనొక్కడినే' పోస్టర్ లో మహేష్ కాలి దగ్గర హీరోయిన్ ఉందని.. వుమన్ ఆబ్జెక్టిఫికేషన్ హీరోయిన్ సమంతా విమర్శించడం.. అదో వివాదం కావడం జనాలకు గుర్తుండే ఉంటుంది. కానీ అప్పుడు విమర్శించిన సమంతా స్వయంగా 'మజిలీ'లో ఒక పాటలో నాగ చైతన్య కాళ్ళకు దణ్ణం పెట్టుకొని కళ్ళకు అద్దుకుంటుంది! ఈమధ్య మజిలీ రిలీజ్ అయినప్పుడు కొందరు నెటిజనులు ఈ విషయాన్ని సమంతాకు గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా సమంతా ఫ్రెండ్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి అలాంటి పరిస్థితే ఎదురైంది. డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరిలో చిన్మయి హీరో హీరోయిన్ ల వయసు తేడా పై ఒక కామెంట్ చేసింది. "వయసు మళ్ళిన హీరోలు తమ కూతురి వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సాధారణం అని.. ఈ ట్రెండ్ ఇంకా అగలేదు.. ఆగిందా?" అంటూ ఒక సెటైర్ లాంటి కామెంట్ చేసింది. అయితే ఇప్పుడు ఆలా కామెంట్ చేసిన చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మథుడు 2' చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో అయిన అక్కినేని నాగార్జున వయసు 59 ఏళ్ళు. ఆయన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. ఈ విషయంపై నెటిజనులు చిన్మయిని గట్టిగా తగులుకున్నారు.

అప్పుడేమో హీరో హీరోయిన్ల వయసు తేడాపై పెద్దపెద్ద మాటలు మాట్లాడావు.. ఇప్పుడు నీ భర్త దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అయ్యేసరికి అదంతా మర్చిపోయి.. ప్రమోట్ చేస్తున్నావు. ఇందులో కూతురి వయసున్న భామలతో జోడీ కట్టడమే కాదు.. ముద్దులు కూడా ఉన్నాయి. ఇది డబల్ స్టాండర్డ్ కాదా? అంటూ నిలదీస్తున్నారు. పనిలో పనిగా గతంలో చిన్మయి చేసిన ట్వీట్ ను కూడా జత చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పడం చిన్మయికే కాదు ఎవరికైనా కష్టమే. అందుకే సెలబ్రిటీలు ఎవరైనా కామెంట్ చేసే ముందు ఆలోచించాలి. లేదంటే ఆర్జీవి సారు లాగా "అవును.. అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు ఇలా అన్నాను.. రేపు మరోలా అంటాను .. అంతా నాయిష్టం" అనే తెగువ ఉండాలి!