Begin typing your search above and press return to search.

నాన్న గారి చివరి జ్ఞాపకం

By:  Tupaki Desk   |   22 Jan 2018 11:25 AM GMT
నాన్న గారి చివరి జ్ఞాపకం
X
తెలుగు సినిమా ఎదుగుదలను దశాబ్దాల పాటు తన భుజాలపై మోసిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు గారు స్వర్గానికేగి ఈ రోజుతో నాలుగేళ్ళు పూర్తయ్యాయి. అక్కినేని అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు బరువెక్కిన గుండెలతో ఆయన జ్ఞాపకాలు తలుచుకుంటున్నారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న రెండో అబ్బాయి హీరో అక్కినేని నాగార్జున భారమైన ఆ రోజుని గుర్తు చేసుకుంటూ తన సెల్ ఫోన్ లో నాన్న గారిని తీసిన చివరి పిక్ ఇదేనంటూ మనం సినిమా సెటింగ్ లో నాగేశ్వర్ రావు గారిని తీసిన ఫోటో తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. మమ్మల్ని వదిలి వెళ్ళినా మీరు బ్రతికే ఉన్నారు అనే జ్ఞాపకాలతోనే మేము సంతోషంగా ఉన్నాం అనే మెసేజ్ ని అభిమానులు కూడా రీ ట్వీట్ చేసుకుంటున్నారు. ఎఎన్ ఆర్ గారు నటించిన చివరి సినిమా మనం ఆ ఇయర్ లోని పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలివడం ఎవరు మర్చిపోలేదు.

వయసు మీరిన తరువాత కూడా నటనే ఊపిరిగా చివరి దాకా నటిస్తూనే ఉన్న నాగేశ్వర్ రావు గారు ఇప్పటి తరానికి ఆదర్శనీయం. ఎన్టీఆర్ తో తెలుగు సినిమాలో మల్టీ స్టారర్ ట్రెండ్ కి బీజం వేసిన నాగేశ్వర్ రావు గారు ఆ తర్వాత వచ్చిన కొత్త తరంలో తన వారసుడు నాగార్జునతో సహా చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ - సుమంత్ - వినోద్ కుమార్ - సుమన్ లాంటి వాళ్ళతో కూడా నటించడం ఆయనకే చెల్లింది. 1992 లో కాలేజీ బుల్లోడు సినిమాలో ఆయనకు 70 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు సైతం కుర్ర హీరో హరీష్ - డిస్కో శాంతిలతో పోటీ పడుతూ స్టెప్స్ వేయటం ఆయనకే చెల్లింది తన మనవాళ్ళు అఖిల్ - నాగచైతన్యలతో కలిసి వెండితెరపై ఒకే ఫ్రేంలో కనిపించాలి అనే చివరి కోరిక తీర్చుకుని మరీ తనలో నటుడిని స్వర్గానికి తీసుకెళ్ళిన ఎఎన్ ఆర్ గారు ఒక వ్యక్తి కాదు. చరిత్ర. ఈ సందర్భంగా నాగ్ షేర్ చేసుకున్న చివరి జ్ఞాపకం చూస్తే మీరూ ఓ సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రావొచ్చు.