Begin typing your search above and press return to search.

'మర్యాద రామన్న' నాకు మైనస్ అయింది: నాగినీడు

By:  Tupaki Desk   |   16 Nov 2021 7:49 AM GMT
మర్యాద రామన్న నాకు మైనస్ అయింది: నాగినీడు
X
తెలుగులో ఉన్న పవర్ఫుల్ కేరక్టర్ ఆర్టిస్టులలో నాగినీడు ఒకరు. తన వాయిస్ లో విలనిజానికి కావలసిన కరకుదనాన్నీ, సాఫ్ట్ కేరక్టర్స్ కి కావలసిన సున్నితత్వాన్ని ఆయన అద్భుతంగా పలికించగలరు. 'మర్యాద రామన్న' సినిమాలో ఆయన పోషించిన 'రామినీడు' పాత్ర ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి కెరియర్ పరంగా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 'మిర్చి' .. 'ఇష్క్' నుంచి ' వకీల్ సాబ్' వరకూ ఆయన ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చారు. ఏ పాత్రను ఇచ్చినా ఇష్టంగా ఒదిగిపోయే సహజనటుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు.

నేను చదువుకుంది .. పెరిగింది అంతా 'గుంతకల్' లోనే. అందువలన నేను రాయలసీమ యాసలో డైలాగ్స్ బాగా చెప్పగలను. రాజకీయాల నుంచి విరామం తీసుకున్న మా నాన్నగారు .. అక్కడ ఒక థియేటర్లో పనిచేసేవారు. ఆ థియేటర్లో ఫస్టు సినిమాగా ఏఎన్నార్ గారి 'పూలరంగడు' సినిమా వచ్చింది. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారిని చూడగానే, నటుడిని కావాలనే కోరిక నాలో కలిగింది. ఇక అప్పటి నుంచి రామారావుగారి సినిమాలు .. కాంతారావుగారి సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టాను. వాళ్ల సినిమాలు చూసి ఇంటికి వెళ్లాక వాళ్లను అనుకరించేవాడిని.

ఆ తరువాత నేను మద్రాసు వెళ్లి కెమికల్ టెక్నాలజీ చదువును పూర్తి చేశాను. అందువలన నాకు ప్రసాద్ ఫిల్మ్ లేబొరేటరీస్ లో పనిచేసే ఛాన్స్ వచ్చింది. అక్కడ పనిచేస్తుండటం వలన సినిమాలో అవకాశాలు వస్తానని భావించాను. కానీ నాలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ఎవరినీ కూడా ఏమీ అడగను. ఆ తరువాత జాబ్ పరంగా బాధ్యతలు పెరిగిపోయాయి .. నేను ఎవరినీ వేషాలు అడగలేదు. ఒకసారి మాత్రం బెల్లంకొండ సురేశ్ అడిగారు .. 'మీరు ఎందుకు నటించకూడదు" అని. "మీరు అవకాశం ఇస్తే చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్" అన్నాను.

అప్పుడు ఆయన నాకు 'చెన్నకేశవరెడ్డి' సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ తరువాత మూడు నాలుగు సినిమాలు చేశానుగానీ .. పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి పరిస్థితులలో తమిళంలో 'పళ్లికూడమ్' అనే సినిమాలో స్నేహకి చిన్నాన్న పాత్రను చేసే ఛాన్స్ వచ్చింది. అది చాలా మంచి రోల్ .. ఫుల్ లెంగ్త్ ఉంటుంది. ఆ క్లిప్పింగ్స్ ను ఎడిటింగ్ ఇన్ ఛార్జ్ తమ్మిరాజుగారు .. రాజమౌళి గారికి చూపించారు. అప్పుడు ఆయన నాకు 'మర్యాద రామన్న' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నన్ను ఒక రేంజ్ కి తీసుకెళ్లింది .. ఎక్కడో కూర్చోబెట్టింది. కాకపోతే ఒక రకంగా అది మైనెస్ అయింది. ఆ తరువాత ఎవరిని వేషాలు అడిగినా .. ఆ స్థాయి వేషాలు తమ సినిమాలో లేవని అంటున్నారు. నాకేమో డబ్బులు కావాలాయే" అంటూ నవ్వేశారు.