Begin typing your search above and press return to search.

కుర్రాడు కష్టపడుతున్నాడు కానీ..

By:  Tupaki Desk   |   8 Aug 2017 9:51 AM GMT
కుర్రాడు కష్టపడుతున్నాడు కానీ..
X
సందీప్ కిషన్ మంచి నటుడని అతను హీరో కాకముందే అందరూ గుర్తించారు. ‘ప్రస్థానం’ సినిమాలో నెగెటివ్ రోల్ లో అతడి అభినయానికి అప్పట్లో చాలా మంచి పేరొచ్చింది. తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హీరోగా నిలబడ్డాడు. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవడంలో సందీప్ విజయవంతం కాలేకపోయాడు. మంచి మంచి అవకాశాలైతే వచ్చాయి కానీ.. అతను ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. బీరువా.. టైగర్ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయాయి. గత ఏడాది ‘రన్’.. ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలు సందీప్ కెరీర్ ను గట్టి దెబ్బే కొట్టాయి. ఐతే ఈ ఏడాది కచ్చితంగా కెరీర్లో పుంజుకుంటానని ఆశించాడు సందీప్. ఆసక్తికరమైన సినిమాలు లైన్లో పెట్టాడు కూడా. కానీ అవేవీ కూడా అతడికి సంతృప్తినివ్వలేదు.

తమిళంలో హిట్టయిన ‘మానగరం’ సినిమా తెలుగులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇంకో ముగ్గురు హీరోలతో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’ కూడా నిరాశ పరిచింది. తాజాగా ‘నక్షత్రం’ డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూడు సినిమాల్లోనూ సందీప్ చాలా బాగా నటించడం.. ఆయా పాత్రల కోసం చాలా కష్టపడటం గుర్తించాల్సిన విషయాలు. మూడు సినిమాల్లోనూ మూడు భిన్నమైన పాత్రలు చేశాడతను. సందీప్ నటనకూ ప్రశంసలు దక్కాయి. కానీ ఆ సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

అందులోనూ తాజాగా ‘నక్షత్రం’ సందీప్ ను కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా కోసం ఏడాది పైగా కష్టపడ్డాడు సందీప్. కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్నందుకు ఎంతో ఎగ్జైటయ్యాడు. బడ్జెట్ సమస్యల వల్ల పారితోషకం కూడా తక్కువే తీసుకున్నట్లు సమాచారం. ఇన్ని త్యాగాలు చేసి.. ఎంతో కష్టపడి నటించిన సినిమాకు వచ్చిన ఫలితం చూశాక సందీప్ తీవ్ర నిరాశకు గురయ్యే ఉంటాడు. ఐతే తెలుగుతో పోలిస్తే తమిళంలో సందీప్ కెరీర్ కొంచెం మెరుగ్గా ఉంది. ‘మానగరం’ హిట్టయింది. త్వరలోనే ‘మాయవన్’ మంచి క్రేజ్ మధ్య రిలీజవ్వబోతోంది. ఆ సినిమా కూడా బాగా ఆడితే.. కనీసం తమిళంలో అయినా హీరోగా స్థిరపడతాడేమో చూద్దాం.