Begin typing your search above and press return to search.

బుర్రిపాలెంలో ‘శ్రీమంతుడు’ భార్య

By:  Tupaki Desk   |   17 March 2016 7:18 AM GMT
బుర్రిపాలెంలో ‘శ్రీమంతుడు’ భార్య
X
మహేష్ బాబు ఎట్టకేలకు రియల్ ‘శ్రీమంతుడు’గా రంగంలోకి దిగాడు. గత ఏడాది పల్లెల దత్తత అనే ఉదాత్తమైన కథాంశం నేపథ్యంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించి మెప్పించిన మహేష్.. ఆ సమయంలో స్వయంగా రెండు పల్లెటూళ్లను దత్తత తీసున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం. తన తండ్రి వచ్చింది ఇక్కడి నుంచే కావడంతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న మహేష్ దత్తత ఆలోచన చేశాడు. కానీ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు ఏడాది అవుతున్నా.. మహేష్ ఏ పనీ మొదలుపెట్టకపోవడంతో అక్కడి జనాలు నిరాశలో ఉన్నారు.

ఐతే ఎట్టకేలకు మహేష్ కార్యక్షేత్రంలోకి దిగాడు. తాను ఇంకా అక్కడికి రాలేదు కానీ.. తన తరఫున భార్య నమ్రతతో పాటు తన సోదరి గల్లా పద్మలను బుర్రిపాలేనికి పంపించాడు. గురువారం ఉదయం నమ్రత - పద్మలతో బుర్రిపాలానికి చేరుకున్నారు. వీరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఎటూ చూసినా సందడి నెలకొంది. మహేష్‌ బాబు సూచనల మేరకు వారి కుటుంబసభ్యులు ఊరంతా తిరిగి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయనున్నట్లు సమాచారం.

సూపర్‌ స్టార్ కృష్ణ సినీరంగ ప్రవేశంతో బుర్రిపాలెం గ్రామానికి మంచి గుర్తింపువచ్చింది. తన ఊరి పేరుతో ‘బుర్రిపాలెం బుల్లోడు’ అనే సినిమా కూడా చేశాడు. కృష్ణ - ఆయన తల్లి గతంలోనే బుర్రిపాలెం గ్రామంలో గీతామందిరం - బడి - గుడి - ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించారు. కానీ తర్వాత కృష్ణ కుటుంబం ఈ ఊరిని పట్టించుకోలేదు. అభివృద్ధి కుంటు పడింది. ఐతే మహేష్ రంగ ప్రవేశంతో మళ్లీ తమ గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు. రోడ్లు - డ్రైనేజీ లాంటి సౌకర్యాలతో పాటు.. యువతకు ఉపాధి కోరుకుంటున్నారు ఇక్కడి జనం. మరి మహేష్ వీరి సమస్యల్ని ఎంతవరకు పరిష్కరిస్తాడో చూడాలి.