Begin typing your search above and press return to search.

*హ‌రికృష్ణ‌కు యాక్సిడెంట్‌..తీవ్ర గాయాలు

By:  Tupaki Desk   |   29 Aug 2018 2:21 AM GMT
*హ‌రికృష్ణ‌కు యాక్సిడెంట్‌..తీవ్ర గాయాలు
X
నిన్న‌నే ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావ్ కార్ యాక్సిడెంట్ అయ్యింద‌న్న‌ వార్త‌తో తెలుగు సినీప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా కంగారు ప‌డింది. తిరుమ‌ల ఘాట్ రోడ్‌లో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురైంద‌న్న వార్త అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెట్టింది. అదృష్టవ‌శాత్తూ ఆ ప్ర‌మాదం నుంచి కె.రాఘ‌వేంద్ర‌రావు బ‌య‌ట‌ప‌డ్డారని తెలియ‌గానే ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. సాక్షాత్తూ ఆ వెంక‌న్న సామి త‌న‌ని ర‌క్షించార‌ని రాఘ‌వేంద్రుడు స‌న్నిహితుల‌తో అన్నార‌ట‌.

ఆ వార్త‌ను మ‌రువ‌క ముందే నేటి ఉద‌య‌మే మ‌రో దుర్వార్త‌. తెలుగుదేశం సీనియర్ నాయకులు, హీరో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. ఆయ‌నకు ఈ ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌య్యాయి. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి ప‌రిస‌రాల్లో బోల్తా కొట్టిందని స్థానికుల స‌మాచారం. ఆయనను ప్ర‌స్తుతం చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉంద‌ని తెలుస్తోంది. నెల్లూరు(ఏపీ)లో జరిగిన ఓ వివాహ వేడుక‌లో పాల్గొన్న ఆయ‌న తిరిగి హైదరాబాద్‌కు వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది.

ఘ‌ట‌నా స్థ‌లి నుంచి వ‌చ్చిన ఫోటోల్ని బ‌ట్టి ప‌రిస్థితి సీరియ‌స్‌గానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. కార్ పూర్తిగా బోల్తా కొట్టి ఉంది. అందులోంచి హ‌రికృష్ణ‌ను ప్ర‌మాద స్థ‌లి వ‌ద్ద కాపాడుతున్న దృశ్యాలకు సంబంధించి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న ఆరోగ్యంపై ఆస్ప‌త్రి వ‌ర్గాల నుంచి స‌మాచారం రావాల్సి ఉందింకా.