Begin typing your search above and press return to search.

'అఖండ'లో ఖర్చు కాదు .. కథ కనిపిస్తుంది: బాలకృష్ణ

By:  Tupaki Desk   |   13 March 2022 2:34 AM GMT
అఖండలో ఖర్చు కాదు .. కథ కనిపిస్తుంది: బాలకృష్ణ
X
బాలకృష్ణ హీరోగా వచ్చిన భారీ చిత్రాలలో .. సంచలన విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో 'అఖండ' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా 100 రోజుల పండుగను 'కర్నూల్' లో నిర్వహించగా, ఈ వేదికపై బాలకృష్ణ తనదైన స్టైల్లో మాట్లాడారు. "ఒక సినిమా జనం మధ్యలో 'శతదినోత్సవ వేడుక'ను జరువుకుని ఎన్ని సమత్సరాలు అయిందో. నిర్మాణ సమయంలో ఈ సినిమా కరోనా కారణంగా ఎన్నో ఆటంకాలను .. అవరోధాలను ఎదుర్కొంది. అలాంటి ఈ సినిమా విడుదలైన తరువాత 100 రోజులు ఆడేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో హైందవ ధర్మాన్ని మరోసారి నిలబెట్టిన సినిమా 'అఖండ' అని చెప్పుకోవాలి. ధర్మానికి హాని కలిగించినప్పుడు భగవంతుడు తన సహాయకుడి ద్వారా మళ్లీ సక్రమమైన మార్గంలో నడిపిస్తాడని చాటి చెప్పిన సినిమా ఇది. మమ్మల్ని పరికరాలుగా చేసుకుని మా ద్వారా ఒక చక్కని సందేశాన్ని ఇప్పించిన భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను బోయపాటి ఎప్పుడూ కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకోము. కథను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళతాము.

మా ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి మంచి అవగాహన ఉంది. మూడే ముక్కల్లో కథను అనుకుంటాము .. దానిని అద్భుతంగా తయారు చేస్తాము. 'సింహా' .. 'లెజెండ్' .. 'అఖండ' సినిమాలు అలాగే పుట్టుకొచ్చాయి. పాత్రలను అద్భుతంగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు మన బోయపాటి గారు. మేము ఇద్దరం కలిసి చేస్తున్న సినిమాలను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే ఇంత దూరం వచ్చాము. మా సినిమా కర్నూల్ లోని మూడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఇక్క అభిమానులు మాత్రమే కాదు .. అందరూ చూడటం వలన .. ఆదరించడం వలన ఈ సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకుంది. ఒక్క తెలుగువారు మాత్రమే కాదు .. భారతదేశమంతా గర్వంతో తల ఎత్తుకునేలా చేసింది ఈ అఖండ చిత్రం. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవలసిన బాధ్యత మాపై ఉంది. నా సినిమాలనే నాకు పోటీగా భావిస్తాను. నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం .. ఆ పాత్రలో జీవించడం. అందుకు కారణమైన దర్శకుడికి .. రచయితలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

తమన్ ఎంతో మంచి పాటలను అందించాడు. ప్రేక్షకులను ఆయన మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లాడు. శ్రీకాంత్ .. జగపతిబాబు .. నితిన్ మెహతా .. ప్రగ్యా .. పూర్ణ అంతా కూడా ఈ సినిమాలో ఎంతో బాగా నటించారు. కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను చేశాము. బయట కరోనా అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మరిచిపోయి పనిచేశాము. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ .. ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.