Begin typing your search above and press return to search.

బాలయ్య భయపడేది ఆ ఒక్కరికే..!

By:  Tupaki Desk   |   16 Oct 2022 3:52 AM GMT
బాలయ్య భయపడేది ఆ ఒక్కరికే..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ''అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షో రెండో సీజన్ వచ్చేసింది. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో.. మొదటి ఎపిసోడ్ తోనే సంచలనం సృష్టిస్తోంది. స్ట్రీమింగ్ అయిన 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించినట్లు ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది.

దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ తొలిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన బాలకృష్ణ.. ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యారు. మొదటి సీజన్ లో నటసింహంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ప్రతీ ఎపిసోడ్ కూడా అన్ స్టాపబుల్ అనిపించుకుంది. దీంతో సీజన్-2 పై అందరిలో ఆసక్తి నెలకొంది.

'అన్ స్టాపబుల్ విత్ NBK-2' టాక్ షో మొదటి ఎపిసోడ్ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 లో సినీ సెలబ్రిటీలు మాత్రమే గెస్టులుగా హాజరవ్వగా.. ఈసారి మాత్రం పొలిటికల్ లీడర్స్ కూడా ఈ షోలో పాల్గొంటారని తెలియజేసింది. సీజన్-2 ఫస్ట్ గెస్టుగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

బావ బావమరిది మధ్య ఆసక్తికరమైన సంభాషణతో సాగిన ఈ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ షో కాబట్టి అందరూ అదే ఉంటుందని అందరూ ఊహించారు. అయితే నందమూరి చరిత్ర - ఆ ఫ్యామిలీలోకి నారా చంద్రబాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంఘటనలు వంటి ఎన్నో విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసారు.

అలానే చంద్రబాబు నాయుడు తన భార్యతోనూ.. తన కోడలితోనూ ఫోన్ మాట్లాడటం వంటివి వినోదాన్ని పంచాయి. ముఖ్యంగా బ్రాహ్మిణికి ఫోన్ చేసినప్పుడు.. ఆమె తన తండ్రి బాలకృష్ణ గురించి చెప్పిన మాటలు నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి.

'నాన్న అన్‌ స్టాపబుల్ మాత్రమే కాదు.. అన్‌ కంట్రోలబుల్ కూడా..' అంటూ నారా బ్రాహ్మణి చెప్పిన తీరు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇదే క్రమంలో 'నేను భయపడేది ఒక్క బ్రాహ్మణికి మాత్రమే. ఎందుకంటే.. బ్రాహ్మణి పర్ఫెక్షనిస్ట్.. నేను కూడా పర్ఫెక్షనిస్ట్.. అందుకే బ్రాహ్మణికి నేను భయపడాల్సి వస్తుంది' అని బాలయ్య చమత్కరించడం అందరినీ అలరించింది.

'అన్ స్టాపబుల్ 2' ఫస్ట్ ఎపిసోడ్ లో నారా చంద్రబాబు మాట్లాడిన దాంట్లో నిజమెంత అనే విషయం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇది పరోక్షంగా టాక్ షోకి మంచి వ్యూయర్ షిప్ తెచ్చిపెడుతోంది. రాబోయే ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఆహా అనిపిస్తాయో చూడాలి.