Begin typing your search above and press return to search.

తెలుగు చలనచిత్ర రాజహంస.. శాతకర్ణి

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:44 PM GMT
తెలుగు చలనచిత్ర రాజహంస.. శాతకర్ణి
X
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి పాటల విడుదల వేడుక తిరుపతిలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌతమిపుత్ర శాతకర్ణి గెటప్ లోనే హాజరైన నందమూరి బాలకృష్ణ.. తెలుగులోనే మాట్లాడుతూ ఆహుతులను అలరించారు. ఆయన మొత్తం మాటల్లో ఇంగ్లీష్ మాట ధ్వనించకుండా జాగ్రత్త పడ్డారంటే.. ఈ వేడుకకోసం బాలయ్య ఎంతగా ప్రిపేర్ అయ్యారో అర్ధమవుతుంది. మొదటగా ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రి వెంకయ్యలతో పాటు అభిమానులు.. మీడియా మితృలకు కళాభివందనాలు చెబుతూ తన స్పీచ్ ను ఆరంభించారు బాలకృష్ణ

'కాకి ఎంత కాలం బతికినా ఉపయోగం ఉండదు. కానీ హంస అలా కాదు. మన తెలుగు చలనచిత్ర రంగానికి రాజహంస.. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో శాతకర్ణి జన్మించారు. దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పాలించిన అంతటి మహనీయ చక్రవర్తి బొడ్డు తాడు తెగింది కోటిలింగాలలోనే. అలాంటి చరిత్ర పురుషుడి గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కాశీలో ఆయన అమ్మగారు వేయించిన శాసనాలతో విషయాలు బయటపడ్డాయి' అన్న బాలయ్య.. క్రిష్ టీం ఎంతో పరిశోధన చేసి బోలెడంత చరిత్రను సేకరించారని చెప్పారు.

'నేను వందో చిత్రం ఏం చేయాలా అనుకుంటున్న టైం.. చాలా కథలు విన్నాను.. కొన్ని నచ్చాయి కూడా. కానీ అవి వందో చిత్రం స్థాయికి సరితూగేలా లేవు. అలాంటి సమయంలో క్రిష్ నాకు ఈ కథ చెప్పాడు. తెలియని విషయాన్ని తెలియచేయాలనే తపన ఈ సినిమా చేసేందుకు పురికొల్పింది. చాలా తక్కువ చరిత్ర ఆనవాళ్లు ఉన్న ఈ సినిమాను చేయడం సాహసం. అయితే.. విభిన్న పాత్రలు చేయాలనే నా తండ్రి గారి అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలనే ఈ సినిమా చేశాను' అన్నారాయన.

'ఈ కార్యక్రమానికి కథానాయకుడు సంగీత దర్శకుడు చిరంతన్ భట్. సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్లే' అన్న బాలయ్య 'నిద్రపోతూ కనేది కల.. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ' అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.