Begin typing your search above and press return to search.

నందమూరి - ఘట్టమనేని వారసులు మాత్రమే మిగిలారు..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 11:36 PM GMT
నందమూరి - ఘట్టమనేని వారసులు మాత్రమే మిగిలారు..!
X
సినీ ఇండస్ట్రీలోని నెపోటిజంపై ఎన్ని చర్చలు జరిగినా.. నట వారసుల ఎంట్రీకి మాత్రం బ్రేక్స్ పడటం లేదు. టాలీవుడ్ లో బంధుప్రీతిపై ఎన్ని విమర్శలు వచ్చినా.. పరిశ్రమలో పెద్ద ఫ్యామిలీల నుంచి ఎవరో ఒకరో పరిచయం అవుతూనే వున్నారు. అయితే నందమూరి - ఘట్టమనేని కుటుంబాలకు చెందిన ఇద్దరు వారసుల తెరంగేట్రం తర్వాత.. తెలుగులో కొన్నేళ్లపాటు స్టార్ కిడ్స్ ఎంట్రీకి బ్రేక్ పడే అవకాశం ఉంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు తర్వాత ఆ లెగసీని కొనసాగించడానికి నాగార్జున హీరోగా వచ్చారు. ఆయన తనయులు నాగచైతన్య - అఖిల్ మరియు మేనల్లుళ్లు సుమంత్ - సుశాంత్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అఖిల్ తరువాత ఈ కుటుంబం నుంచి ఇప్పట్లో మరో హీరో వచ్చే అవకాశమే లేదు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి..ఆ తర్వాత తన సపోర్ట్ తో ఎంతో మంది మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ - వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ వంటి వారు హీరోలుగా వచ్చారు.

అలానే అల్లు రామలింగయ్య మనవలైన అల్లు అర్జున్ మరియు శిరీష్ కూడా హీరోలయ్యారు. మెగా - అల్లు కుటుంబాల నుంచి ఇప్పుడప్పుడే నట వారసుల ఎంట్రీ ఉండకపోవచ్చు. బన్నీ తనయుడు అల్లు అయాన్ పెరిగి పెద్దవాడైన తర్వాత హీరోగా పరిచయం చెయ్యొచ్చు. మంచు ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పట్లో హీరోలు వచ్చే ఛాన్స్ లేదు.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ హీరోగా రాణిస్తుండగా.. సోదరుడు సురేష్ బాబు తనయుడు రానా కూడా హీరో అయ్యాడు. ఇప్పుడు దగ్గుబాటి అభిరామ్ కూడా అహింస అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకీ కొడుక్కి సినిమాల మీద ఆసక్తి ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా అతని తెరంగేట్రానికి టైం పట్టొచ్చు.

నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రామారావు వారసత్వంగా బాలకృష్ణ - హరికృష్ణలు ఇండస్ట్రీకి వచ్చారు. వీరి బాటలో జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ - తారకరత్న హీరోలుగా పరిచయమయ్యారు. ఇప్పుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతోంది.

నందమూరి మూడో తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనయుడి ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేస్తున్నానని అప్పట్లో బాలయ్య స్వయంగా వెల్లడించారు. 'ఆదిత్య 369' కు సీక్వెల్ గా బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కే 'ఆదిత్య 999 మాక్స్' సినిమా ద్వారా కుమారుడి అరంగేట్రం ఉండే అవకాశం వుంది. వచ్చే యేడాది ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్తుంది.

ఇక ఘట్టమనేని కుటుంబం నుంచి కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నారు. ఆయన బావ సుధీర్ బాబు హీరో అవ్వగా.. మేనల్లుడు అశోక్ గల్లాని కూడా హీరోగా లాంచ్ చేశారు. హీరోగా కొన్ని సినిమాలు చేసిన రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరో అవ్వాలని ఆశ పడుతున్నాడు.

జయకృష్ణ ఇప్పటికే విదేశాల్లో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటున్నట్లు టాక్. తాత కృష్ణ మరణించడంతో అమెరికా నుంచి వచ్చాడు. మూడో రోజు చిన్న కర్మ ఫోటోలలో మహేశ్ బాబు పక్కన ఉన్న రమేష్ బాబు కొడుకుపై అందరి దృష్టి పడింది. త్వరలోనే బాబాయ్ అండతో జయకృష్ణ కూడా హీరోగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గౌతమ్ ఎంట్రీకి ఇంకా టైం పడుతుంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం మోక్షజ్ఞ మరియు జయకృష్ణ తెరంగేట్రం మాత్రమే మిగిలి ఉంది. వీరి తర్వాత ఏ ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పుడప్పుడే హీరోలుగా వచ్చే వారెవరూ లేరు. అంటే నందమూరి - ఘట్టమనేని వారసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటు స్టార్ కిడ్స్ లాంచింగులకు బ్రేక్ పడుతుందన్నమాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.