Begin typing your search above and press return to search.

ఏపీ అవార్డులపై కమల్, రజినీ స్పందించారు

By:  Tupaki Desk   |   15 Nov 2017 10:32 AM IST
ఏపీ అవార్డులపై కమల్, రజినీ స్పందించారు
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నంది అవార్డులతో పాటుగా కొన్ని ప్రత్యేక పురస్కారాలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఒకటి. 2015 సంవత్సరానికి ఈ అవార్డును దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఇవ్వగా.. 2014కు లోకనాయకుడు కమల్ హాసన్, 2016కు సూపర్ స్టార్ రజినీకాంత్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. తమిళ సినిమాకు రెండు కళ్లు అనదగ్గ ఈ ఇద్దరినీ ఒకే అవార్డుకు ఒకేసారి ఎంపిక చేయడం విశేషమే. ఈ అవార్డు విషయంలో కమల్, రజినీలిద్దరూ తమ సంతోషాన్ని ప్రకటించారు.

మామూలుగా అవార్డుల్ని చాలా తేలిగ్గా తీసుకునే కమల్‌తో పాటు రజినీ కూడా ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘2016 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికైనందుకు రజినీకాంత్‌కు అభినందనలు. నాకు మరోసారి గౌరవం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్ ఆరంభం నుంచి నాకెంతో మద్దతు ఇస్తున్నారు. మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను’’ అని పేర్కొంటూ చివర్లో ‘కృతజ్నతలు’ అనే తెలుగు పదాన్ని జోడించాడు కమల్. ఆయన గతంలో తెలుగులో చేసిన కొన్ని సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. మరోవైపు రజినీ సైతం తనకు ఎన్టీఆర్ అవార్డు దక్కడంపై ట్వీట్ చేశాడు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నాడు.