Begin typing your search above and press return to search.

ఒక సినిమాతో డైరెక్టర్ డబుల్ విన్నర్

By:  Tupaki Desk   |   11 March 2016 9:30 AM GMT
ఒక సినిమాతో డైరెక్టర్ డబుల్ విన్నర్
X
ఓ మూవీ విజయవంతమైతే ఆ సినిమా డైరెక్టర్ కి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ భారీ క్రేజ్ లేని యాక్టర్స్ తో సినిమా చేసి సక్సెస్ సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కళ్యాణ వైభోగమే చిత్రంతో దర్శకురాలు నందినీ రెడ్డి దీన్ని సాధించింది. అయితే.. సినిమా సక్సెస్ తో పాటే ఈమెకు మరో జాక్ పాట్ కూడా తెచ్చి పెట్టింది కళ్యాణ్ వైభోగమే.

నాగశౌర్య - మాళవిక జంటగా నటించిన కళ్యాణ వైభోగమే.. నిర్మాత కే.దామోదర ప్రసాద్ కు భారీ లాభాలనే తెచ్చి పెడుతోంది. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్లు ఎక్కువగానే వస్తుండడంతో.. ప్రొడ్యూసర్ కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో యూఎస్ రైట్స్ తో డైరెక్టర్ నందినీ రెడ్డికి డబుల్ సక్సెస్ సాధించినట్లయింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను నందినీ రెడ్డి కేవలం 25వేల డాలర్లను చెల్లించి దక్కించుకోగా.. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా అక్కడ కూడా కళ్యాణ వైభోగమే మంచి వసూళ్లనే రాబడుతోంది. తన స్నేహితులతో కలిసి నందినీరెడ్డి ఓవర్సీస్ లో సొంతంగా ఈ సినిమాని రిలీజ్ చేసుకుంది.

ఇప్పటికే కళ్యాణ వైభోగమే ఓవర్సీస్ కలెక్షన్స్ 1,50,000 డాలర్లను దాటిపోయాయి. మన కరెన్సీలో అయితే.. ఇది ఓ కోటి రూపాయలకు సమానం. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. దీంతో ఒక వైపు హిట్, రెండో వైపు కలెక్షన్ కిక్కు అందించి.. నందినీ రెడ్డిని డబుల్ విన్నర్ గా నిలిపింది కళ్యాణ వైభోగమే.