Begin typing your search above and press return to search.

'ఓ బేబి' చూసి కాళ్లు మొక్కాడు!

By:  Tupaki Desk   |   5 July 2019 5:30 PM GMT
ఓ బేబి చూసి కాళ్లు మొక్కాడు!
X
నేటి ఉద‌యం హైద‌రాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఆ దృశ్యం అవాక్క‌య్యేలా చేసింది. అప్ప‌టివ‌ర‌కూ `ఓ బేబి` సినిమా చూసిన ఆ 70 ఏళ్ల‌ పెద్దాయ‌న ఉన్న ఫలంగా ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి వ‌ద్ద‌కు వ‌చ్చి ఎంతో ఉద్వేగానికి లోన‌య్యాడు. ``మా బాధను.. మాలో అంత‌ర్గ‌తంగా న‌లిగే వేద‌న‌ను.. ఎమోష‌న్ ని.. ఫీలింగ్స్ ను.. మాలో మాత్రమే మిగిలిపోయే సంఘర్షణను చాలా గొప్పగా చూపించావమ్మా`` అంటూ ఆ పెద్దాయన నందినిరెడ్డి కాళ్లు పట్టుకున్నంత పని చేశాడట. ఆ టైమ్ లో ఐమ్యాక్స్ లో ప్రేక్ష‌కుల స్పంద‌న ఎలా ఉందో ప‌రిశీలించేందుకు వ‌చ్చిన నందిని రెడ్డి స‌డెన్ ట్విస్టుకి షాక్ కి గుర‌య్యారు.

అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు తార‌స‌ప‌డుతుంటాయి. మొన్న టీమిండియా- బంగ్లా దేశ్ క్రికెట్ మ్యాచ్ వేళ ఆ 80 ఏళ్ల‌ పెద్దావిడ కోహ్లీని క‌లుసుకుని ఎమోష‌న్ అయిన చందంగానే.. నందిని రెడ్డి ద‌గ్గ‌ర ఆ పెద్దాయ‌న కూడా అంతే ఎమోష‌న్ కి గుర‌య్యాడు. సినిమా చూశాక‌.. ఆ ఉద్వేగాన్ని త‌ట్టుకోలేక కాళ్లు మొక్క‌బోయాడు. అయితే ఆ ఆక‌స్మిక సంఘ‌ట‌న‌కు త‌త్త‌ర ప‌డిన నందిని రెడ్డి వెంట‌నే తేరుకుని అత‌డిని వారించారు.

నిజంగా ఒక డైరెక్టర్ కి ఇంత‌కంటే ఏం కావాలి. తమ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల నుండి ఇలాంటి స్పందన రావ‌డం మ‌ర‌పురాని గొప్ప అనుభూతి లాంటిదే. ఇలాంటి ఘటనల ఎదురైతే.. ఇక ఆ డైరెక్టర్ ఆ సినిమాకి పడిన కష్టాన్నంతా మర్చిపోవచ్చు. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో నందిని రెడ్డి తెర‌కెక్కించిన ఓ బేబి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సోషియా ఫాంటసీ టచ్ తో మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని చెప్పే ప్రయత్నం బావుంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `అలా మొద‌లైంది` త‌ర్వాత మ‌ళ్లీ నందిని రెడ్డి కామెడీని చ‌క్క‌గా డీల్ చేశార‌న్న ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. `కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి అనువాదంగా వచ్చిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్- గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.