Begin typing your search above and press return to search.

థియేటర్లు లేవు.. ఏం చేయమంటారు?

By:  Tupaki Desk   |   3 Feb 2016 7:30 AM GMT
థియేటర్లు లేవు.. ఏం చేయమంటారు?
X
ఈ రోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. దాన్ని సరైన టైమింగ్‌ లో, ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసుకోవడమే గొప్ప. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఈ టైమింగ్, థియేటర్ల సమస్య ఉంది. నందిని రెడ్డి కొత్త సినిమా ‘కళ్యాణ వైభోగమే’కి కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురవుతోంది. ఈ సినిమా నెల కిందటే రిలీజ్‌ కు రెడీ అయిపోయింది. ఐతే సరైన టైమింగ్ కోసం చూస్తున్నారు. సంక్రాంతి ముగిశాక తర్వాతి వారం రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ సంక్రాంతి సినిమాలు రెండో వారం కూడా మంచి కలెక్షన్లు రాబడుతుండటంతో థియేటర్లు ఖాళీ చేయలేదు.

ఆ తర్వాతి వారం, ఆ తర్వాతి వారం అనుకుంటూ రెండు వారాలు గడిచిపోతున్నాయి. కానీ సినిమా గురించి అతీ గతీ లేదు. ఇంతకీ ఏంటి మేటర్ అని డైరెక్టర్ నందిని రెడ్డినే అడిగితే.. థియేటర్లు దొరక్కే సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నట్లు చెప్పింది. ‘‘మా సినిమా గురించి జనాలు అడుగుతుండటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ రోజుల్లో ఓ చిన్న సినిమాను రిలీజ్ చేసుకోవడం ఎంత కష్టమో చెప్పేదేముంది? థియేటర్ల సమస్యతోనే సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం. మంచి టైమింగ్ చూసి విడుదల చేస్తాం. ఎంత ఆలస్యమైనా సినిమా మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో నాది గ్యారెంటీ’’ అని చెప్పింది నందిని. తర్వాతి మూడు వారాలకూ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి ‘కళ్యాణ వైభోగమే’ నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.